మండుతున్న చమురు

Oil prices finish higher with U.S. supplies down a second week in a row - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు  మరింత   ఎగిశాయి.  లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 0.15 శాతం బలపడి 79.39 డాలర్లకు చేరింది. న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ సైతం 0.3 శాతం పెరిగి 71.72 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఫలితంగా చమురు ధరలు 2014 నవంబర్‌నాటి స్థాయిలను తాకాయి. అమెరికాలో ఇంధన నిల్వలు తగ్గడంతో చమురు ధరలు మరింత బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

గత వారం అమెరికాలో చమురు నిల్వలు 1.4 మిలియన్‌ బ్యారళ్లమేర క్షీణించినట్లు ఆ దేశ ఇంధన శాఖ తాజాగా వెల్లడించింది. ఈ బాటలో గ్యాసోలిన్‌ స్టాక్‌పైల్స్‌ సైతం 3.79 మిలియన్లు తగ్గిందని తెలిపింది.  మధ్యప్రాచ్యంలో చమురు సరఫరాలకు కీలకమైన ఇరాన్‌తో మూడేళ్ల క్రితం కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని అమెరికా రద్దు చేసుకోవడంతో చమురు ధరలకు రెక్కలొచ్చాయని విశ్లేషకులు భావిస్తున్నాయి. అణు ఒప్పందం రద్దుతోపాటు ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించడంతో చమురు ధరలు మండుతున్నాయి. వెనిజులా చమురు సరఫరాలు సైతం తగ్గడం దీనికి మరోకారణంగా  మార్కెట్‌ వర్గాల  అంచనా. ఇప్పటికే ఒపెక్‌ దేశాల ఉత్పత్తి కోత కారణంగా చమురు సరఫరా తగ్గుముఖం పట్టడంతో  ధరలు  భగ్గుమంటున్నాయి.  అటు దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా మూడురోజులుగా  వరుస పెరుగుదలను నమోదు  చేస్తున్నాయి. వరుసగా పెట్రోల్‌ , డీజిల్‌ ధరలు ఇప్పటికే కొత్త గరిష్టాలను తాకుతున్న సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top