భారత ఐటీ నిపుణులకు భారీ ఊరట

No Big Changes In H-1B Visa, Nothing New On H-4 Rules, Says US - Sakshi

వాషింగ్టన్‌: డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం వీసా విధానాల్లో  కీలక మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అమెరికా డిప్యూటీ చీఫ్‌ ఆఫ్ మిషన్‌ మేరీ కే ఎల్‌ కార్ల్‌సన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. హెచ్‌1-బీ వీసా ప్రోగ్రాంలో పెద్దగా మార్పులేమీ లేవని  న్యూఢిల్లీలో  ప్రకటించారు. అంతేకాదు హెచ్‌-4 వీసాల జారీలోకూడా కొత్త మార్పులేమీ చేయడం లేదని పేర్కొనడం విశేషం.  ఉద్యోగ వీసాలు, పని అనుమతులు ఇవ్వడం అమెరికా సార్వభౌమ నిర్ణయమని ఆమె స్పష్టం చేశారు. భారత్‌, అమెరికాల మధ్య ఉన్నత విద్యకు సంబంధించిన సంబంధాల నేపథ్యంలో  అమెరికా మిషన్‌ ‘స్టూడెంట్‌ వీసా డే’ కార్యక్రమాన్ని ఢిల్లీలో నిర్వహించిన సందర్భంగా ఆమె  వ్యాఖ్యలు చేయడం గమనార్హం.   

చెన్నై, హైదరాబాద్, కోలకతా, ముంబైలోని అమెరికా రాయబార కార్యాలయాల్లో ఈ ఇంటర్వ్యూలు నిర్వహించారు. దాదాపు 4వేలమంది విద్యార్థులు వీసాకు దరఖాస్తు చేసుకున్నట్టు కార్ల్‌సన్‌ చెప్పారు. 2017లో 186,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు అమెరికాలో  ఉన్నత విద్యాసంస్థల్లో చేరారని తెలిపారు.  దశాబ్దంతో పోలిస్తే  రెండింతలు, అంతకుముందు ఏడాదితో పోలిస్తే 12 శాతం పెరిగిందని మీడియా ప్రతినిధులతో చెప్పారు.  మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో 17 శాతం మందితో  భారత్ రెండవ స్థానంలో ఉందని కార్ల్‌సన్‌ వెల్లడించారు. 

ఈ సందర్భంగా కార్ల్‌సన్‌ విలేకరులతో మాట్లాడుతూ.. హెచ్‌1-బీ వీసా ప్రోగ్రాంలో పెద్ద మార్పులేమీ లేవని, అలాగే హెచ్‌-4 వీసాలోనూ కొత్త విషయాలేమీ లేవని అన్నారు. హెచ్‌1-బీ వీసా దారుల జీవిత భాగస్వాములకు అమెరికాలో పనిచేసుకునేందుకు హెచ్‌-4 వీసా  ద్వారా అనుమతి లభిస్తుంది. ప్రస్తుతం హెచ్‌-4 వీసాతో దాదాపు 70వేల మంది లబ్ది పొందుతున్నారు. వీరిలో ముఖ్యంగా భారతీయులే ఎక్కువగా ఉన్నారు.  హెచ్‌-4 వీసా నిబంధనను ఎత్తేయకుండా అన్ని ప్రయత్నాలు చేస్తామని గత నెల  భారత విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్‌ వెల్లడించారు.

కాగా ట్రంప్‌ యంత్రాంగం అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో ప్రవేశపెట్టిన హెచ్‌-4 వీసా వర్క్‌ పర్మిట్‌ను ఎత్తేయాలని  భావించారు. అమెరికా ఉద్యోగాలు, అమెరికన్లకే అనే నినాదంతో ట్రంప్‌ సర్కార్‌  వీసా జారీ ప్రక్రియలో పలు మార్పులకు యోచిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో భారత ఐటీనిపుణులు భారీ ఆందోళనలో పడిపోయారు. అయితే కార్ల్‌సన్‌ తాజా వ్యాఖ‍్యలు వేలాదిమంది భారతీయుల్లో భారీ ఊరట కల్పించనునున్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top