రష్యా పొటాష్ కంపెనీపై ఎన్‌ఎండీసీ కన్ను..

రష్యా పొటాష్ కంపెనీపై ఎన్‌ఎండీసీ కన్ను..


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా అన్ని కమోడిటీ ధరలు తక్కువ స్థాయిలో ఉండటంతో కొత్త పెట్టుబడులకు ఇది సరైన తరుణంగా ఎన్‌ఎండీసీ భావిస్తోంది. ఇందుకోసం దేశ విదేశాల్లో భారీగా విస్తరణ కార్యక్రమాలను చేపట్టాలని భావిస్తోంది. ఇప్పటి వరకు ముడి ఇనుము ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఎన్‌ఎండీసీ ఇప్పుడు అంతర్జాతీయంగా ఫాస్పేట్, పొటాష్, కోకింగ్ కోల్, వజ్రాల గనులపై దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా రష్యాకు చెందిన పొటాష్ తయారీ కంపెనీని కొనుగోలు చేయడంపై దృష్టిసారించినట్లు ఎన్‌ఎండీసీ చైర్మన్ నరేంద్ర కొఠారి తెలిపారు.



దీనికి సంబంధించి కంపెనీ మదింపు ప్రక్రియ కొనసాగుతోందని, ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఈ కంపెనీ టేకోవర్ పూర్తవుంతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆర్థిక ఫలితాలను వెల్లడించడానికి గురువారం సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారీ విస్తరణ కార్యక్రమాలను ప్రకటించారు. అంతర్జాతీయంగా అన్ని కమోడిటీస్ ధరలు తక్కువగా ఉండటంతో కొత్త రంగాలకు విస్తరించడానికి ఇది సరైన తరుణంగా భావిస్తున్నామని, ఇందుకోసం ఎన్‌ఎండీసీ వద్దనున్న సుమారు రూ. 20,000 కోట్ల నగదు నిల్వలను వినియోగించనున్నట్లు తెలిపారు.



ఆస్ట్రేలియా, ఆఫ్రికాలోని బొగ్గు గనులతో పాటు, బంగారం, వజ్రాల గనులపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. గతేడాది దేశీయంగా విస్తరణ కార్యక్రమాల కోసం రూ. 3,136 కోట్లు వ్యయం చేయగా, ఈ ఏడాది రూ. 3,500 కోట్లు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎస్‌పీవో మోడల్‌లో ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. కర్ణాటకలో ఏర్పాటు చేస్తున్న ఏడు మిలియన్ టన్నుల ఉక్కు కర్మాగారం ఈ డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

 

100 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం

2024-25 నాటికి 100 మిలియన్ టన్నుల ముడి ఇనుమును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కొఠారి తెలిపారు. ప్రస్తుతం ఉత్పత్తి సామర్థ్యం 30.44 మిలియన్ టన్నులుగా ఉందని, అది ఈ ఏడాది 35 మిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

 

తగ్గిన లాభం: మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసిక నికర లాభంలో 31 శాతం క్షీణత నమోదయ్యింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి రూ. 1,962 కోట్లుగా ఉన్న నికర లాభం ఇప్పుడు రూ. 1,347 కోట్లకు తగ్గింది. అంతర్జాతీయంగా ముడి ఇనుము ధరలు తగ్గడం, హుద్‌హుద్ తుఫాన్ వల్ల ముడి ఇనుము సరఫరా నిలిచిపోవడం లాభాలు తగ్గడానికి కారణంగా పేర్కొన్నారు. సమీక్షా కాలంలో ఆదాయం రూ.3,884 కోట్ల నుంచి రూ. 2,829 కోట్లకు తగ్గింది. పూర్తి ఏడాదికి రూ. 12,356 కోట్ల ఆదాయంపై రూ. 6,422 కోట్ల రికార్డు లాభాన్ని నమోదు చేసింది. వాటాదారులకు రూ. 1.30 తుది డివిడెండ్‌ను బోర్డు ప్రతిపాదించింది. దీంతో ఏడాది మొత్తం మీద షేరుకు రూ.7.25 డివిడెండ్‌ను ఎన్‌ఎండీసీ అందించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top