లీటర్‌ ఇంజిన్‌తో రెడీ-గో..ధరెంతో తెలుసా?


న్యూఢిల్లీ :
జపనీస్‌ ఆటో దిగ్గజం నిస్సాన్‌ కొత్తగా ఒక లీటరు ఇంజిన్‌తో డాట్సన్‌ రెడీ-గో కారును మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. దీని ధర ఎక్స్‌షోరూం ఢిల్లీలో రూ.3.57 లక్షలుగా నిస్సాన్‌ తెలిపింది. ఈ కొత్త వాహనం లీటరుకు 22.5 కిలోమీటర్లు వరకు ప్రయాణించే ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని పేర్కొంది. ఈ కారు టాప్‌-వేరియంట్‌ మోడల్‌ ధర రూ.3.72 లక్షలుగా ఉంది. గతేడాది విజయవంతంగా లాంచ్‌ చేసిన రెడీ-గోలో ప్రస్తుతం తీసుకొచ్చిన 1.0 లీటర్‌ ఇంజిన్‌ వేరియంట్‌ అత్యంత శక్తివంతమైన డ్రైవింగ్‌ అనుభవాన్ని అందించనున్నట్టు నిస్సాన్‌ మోటార్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అరుణ్‌ మల్హోత్రా చెప్పారు.  

 

ఈ కొత్త మోడల్‌ అత్యంత శక్తివంతమైనదిగా ఉంటుందని, కస్టమర్లకు స్టయిల్‌గా‌, అనుకూలంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఫైవ్‌ స్పీడు మాన్యువల్‌ ట్రాన్సమిషన్‌ ఇది కలిగిఉంది. గతేడాదే 800సీసీ రెడీ-గోను నిస్సాన్‌ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఆ తర్వాత ఈ మోడల్‌ను లిమిటెడ్‌ ఎడిషన్‌లో స్పోర్ట్స్‌ వేరియంట్‌ను కూడా ప్రవేశపెట్టింది. 2014లో భారత్‌లో ఎంట్రీ లెవల్‌ డాట్సన్‌ గో లాంచ్‌ చేయడంతో నిస్సాన్‌, డాట్సన్‌ బ్రాండును గ్లోబల్‌గా రీలాంచ్‌ చేసింది. గో, గో ప్లస్ కార్ల తర్వాత డాట్సన్ బ్రాండ్ కింద కంపెనీ మూడో కారుగా రెడీ-గోను తీసుకొచ్చింది. చిన్న కార్ల మార్కెట్‌లో సత్తా చాటేందుకు రెడీ-గోను డాట్సన్‌ తీసుకొచ్చింది. డాట్సన్‌ బ్రాండులో ఇప్పటివరకు 90,000 యూనిట్ల వాహనాలు అమ్ముడుపోయాయి. 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top