
న్యూఢిల్లీ: ఎకానమీలో కాస్త మందగమనమే తప్ప మాంద్యం లేదని, రాబోదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడాన్ని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా తప్పుబట్టారు. డిమాండ్ పూర్తిగా బలహీనపడ్డం ప్రస్తుత సంక్షోభానికి కారణమని ఆయన పేర్కొన్నారు. దీనిపై సీతారామన్ వ్యాఖ్యలు తీవ్రంగా నిరాశపర్చాయన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం ఒక భ్రమలోనే ఉందని.. అదే స్థితిలో కొనసాగితే సమస్య ఎన్నటికీ పరిష్కారం కాదని చెప్పారాయన. నేషనల్ ఎకానమీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు.
వ్యవసాయ రంగంలో ఒత్తిళ్లను ప్రభుత్వం పట్టించుకోలేదని సిన్హా చెప్పారు. ‘ప్రస్తుతం చూస్తున్న ఆర్థిక సంక్షోభం రాత్రి రాత్రే వచి్చనది కాదు. ఇదేమీ హఠాత్తుగా జరిగిన రైలు ప్రమాదం లాంటిది కాదు. చాన్నాళ్ల నుంచి నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. కంపెనీలు ఒక్కొక్కటిగా దివాలా తీస్తున్నాయి. కొనుగోలుదారు దొరక్కుంటే ఎయిరిండియాను మూసేస్తామని ప్రభుత్వమే చెబుతోంది. ఇలాంటి వాటివల్ల వేల ఉద్యోగాలు పోతాయి. వారు అడుక్కోవాల్సిన పరిస్థితి తెస్తున్నారు‘ అని తీవ్రంగా ఆక్షేపించారు.
ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది..
ప్రస్తుత సంక్షోభమంతా దేశీయంగా నెలకొన్న పరిస్థితుల వల్ల తలెత్తిందేనని, దీనికి ఏవేవో కారణాలు చెబుతూ ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని సిన్హా వ్యాఖ్యానించారు. కేంద్ర ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నారు. రిజర్వ్ బ్యాంక్‌ను దోచుకున్నప్పటికీ.. ఈ ఏడాది ఆర్థిక స్థితి మరింత దుర్భరంగా ఉండబోతోందని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థకు దేశీ పరిస్థితులే కారణమని, ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని సమావేశంలో పాల్గొన్న పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు.