నీరవ్‌ మోదీ, విజయ్‌ మాల్యాకు గట్టి షాక్‌?

New law to make it tough for corporate fugitives - Sakshi

న్యూఢిల్లీ : కోట్లకు కోట్లు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి లేదా బ్యాంకులను మోసం చేసి విదేశాలకు చెక్కేస్తున్న రుణ ఎగవేతదారులకు ప్రభుత్వం షాకివ్వబోతుంది. ఆర్థిక నేరగాళ్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన చట్టం తీసుకొస్తోంది. ''ది ఫ్యుజిటివ్‌ ఎకనామిక్‌ అఫెండర్స్‌ బిల్లు'' పేరుతో దీన్ని త్వరలోనే ప్రవేశపెట్టబోతుంది. ఈ చట్టం ద్వారా నీరవ్‌ మోదీ, విజయ్‌ మాల్యా లాంటి వారు బ్యాంకులకు భారీగా కన్నం వేసి విదేశాలకు పారిపోతే, వారి ఆస్తులను అమ్మే చట్టం. స్పెషల్‌ కోర్టు ద్వారా అన్ని బకాయిలను వెంటనే రికవరీ చేసుకునేలా ఈ బిల్లు సహకరించనుంది. విదేశాలకు పారిపోయినప్పటికీ, వారు ఏం దాచలేరని కచ్చితంగా ఇక్కడ అన్ని ఆస్తులను విక్రయించే అధికారం దక్కించుకునేలా ఈ బిల్లు తోడ్పడనుంది. 

గత సెప్టెంబర్‌లోనే కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ డ్రాఫ్ట్‌ను ఆమోదించింది. పీఎన్‌బీ స్కాం నేపథ్యంలో ఈ బిల్లును పాస్‌ చేయాలని మోదీ ప్రభుత్వం చూస్తోంది. మార్చి 6 నుంచి జరుగబోతున్న తదుపరి బడ్జెట్‌ సెషన్లలో దీన్ని ఆమోదించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒక్కసారి ఈ బిల్లు ఆమోదిస్తే, దర్యాప్తు సంస్థ విదేశాలకు పారిపోయిన రుణ ఎగవేతదారులు, బ్యాంకులకు మోసాలకు పాల్పడిన ఆర్థిక నేరగాళ్ల ఆస్తులను ఎలాంటి దాడులు చేయకుండానే స్వాధీనం చేసుకోవచ్చు. రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా, ఫైనాన్సియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ కూడా ఈ చర్యలను అమలు చేయాల్సి ఉంటుంది.

అసాధారణ లావాదేవీలను గుర్తించి, అథారిటీలకు అలర్ట్‌ చేయాల్సిన బాధ్యత కూడా బ్యాంకింగ్‌ రెగ్యులేటర్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌దే. ఎగవేత కంపెనీల వ్యాపార నమూనాల మార్పులపై ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీలు ఎప్పడికప్పుడు దృష్టిసారించాలి. అంతేకాక ఎగవేత కంపెనీ ప్రమోటర్లపై చర్యలు మాత్రమే కాక, వారి విదేశీ ప్రయాణాలను నిలువరించేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో దాదాపు రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్‌ మోదీ, విదేశాలకు పారిపోవడంతో ప్రభుత్వం అలాంటి వ్యక్తులపై గట్టి చర్యలు తీసుకునేందుకు ఈ బిల్లును తీసుకొస్తోంది. విజయ్‌ మాల్యా కూడా ఇలానే రూ.9000 కోట్లను బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేశాడు. 

అయితే ఎవరు ఫ్యుజిటివ్‌ ఎకనామిక్‌ అఫెండర్‌ : 
సంబంధిత నేరం కింద ఏ వ్యక్తికైనా అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయి, అతను క్రిమినల్‌ ప్రొసిక్యూషన్‌ తప్పించుకోవడానికి భారత్‌ను వీడి వెళ్లితే అతణ్ని ఫ్యుజిటివ్‌ ఎకనామిక్‌ అఫెండర్‌గా గుర్తిస్తారు. ఈ డ్రాఫ్ట్‌ బిల్లులో పేర్కొన్న నేరాల్లో ఉద్దేశ్యపూర్వకంగా రుణాన్ని ఎగవేతదారులు, మోసం, ఫోర్జరీ, ఎలక్ట్రానిక్‌ రికార్డుల తప్పుడు డాక్యుమెంట్లు, సుంకాలు ఎగవేత, డిపాజిట్లు తిరిగి చెల్లించనని ఉన్నాయి. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top