ప్రభుత్వం చేతికి యూనిటెక్‌ పగ్గాలు

NCLT allows govt to take control of Unitech - Sakshi

కంపెనీ డైరెక్టర్లను సస్పెండ్‌ చేసిన ఎన్‌సీఎల్‌టీ

10 మంది డైరెక్టర్లను నామినేట్‌ చేయాలని ఎంసీఏకి ఆదేశాలు

ఈ నెల 20న తదుపరి విచారణ

న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో ఇరుక్కుపోయిన రియల్టీ దిగ్గజం యూనిటెక్‌కి నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) గట్టి షాకిచ్చింది. నిధుల స్వాహా, నిర్వహణ లోపాల అభియోగాలపై యూనిటెక్‌ బోర్డులోని మొత్తం ఎనిమిది మంది డైరెక్టర్లను సస్పెండ్‌ చేసింది. రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం కొత్తగా పది మంది డైరెక్టర్లను నామినేట్‌ చేయాలని ఆదేశించింది. వారి పేర్లను తదుపరి విచారణ తేదీ అయిన డిసెంబర్‌ 20లోగా అందించాలని కేంద్రానికి సూచన చేసింది.

తాజా ఆదేశాలపై సమాధానం ఇవ్వాలని జస్టిస్‌ ఎం.ఎం.కుమార్‌ సారథ్యంలోని ద్విసభ్య బెంచ్‌ అటు యూనిటెక్‌కు కూడా నోటీసులు జారీ చేసింది. తొలగించిన ఎనిమిది మంది డైరెక్టర్లు తమ వ్యక్తిగత, కంపెనీ ఆస్తులను విక్రయించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ సంజయ్‌ జైన్‌ ఈ విషయాలు వెల్లడించారు.

నిర్వహణ లోపాలు, మేనేజ్‌మెంట్‌ నిధు లు స్వాహా చేసిన ఆరోపణల నేపథ్యంలో కంపెనీ యాజమాన్య బాధ్యతలను తమ చేతికి అప్పగించాలంటూ కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ(ఎంసీఏ) పిటిషన్‌ వేసిన  దరిమిలా ట్రిబ్యునల్‌ ఈ ఆదేశాలిచ్చింది. కంపెనీని మూసివేయడానికి తగిన కారణాలున్నా.. 19,000 పైచిలుకు గృహాల కొనుగోలుదారులు, చిన్న డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో యాజమాన్య బాధ్యత లు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఎంసీఏ వాదనలు వినిపించింది. యూనిటెక్‌ డైరెక్టర్ల జాబితాలో చైర్మన్‌ రమేష్‌ చంద్ర, ఎండీలు అజయ్‌ చంద్ర, సంజయ్‌ చంద్ర తదితరులు ఉన్నారు.  

యూనిటెక్‌ రుణభారం రూ.6,000 కోట్లకు పైగా పేరుకుపోయింది. సుమారు 70 ప్రాజెక్టుల్లో దాదాపు 16,000 ఇళ్లను కొనుగోలుదారులకు అందించాల్సి ఉంది. ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించినప్పటికీ... ప్రాజెక్టును ప్రారంభించడం లేదన్న ఆరోపణలపై యూనిటెక్‌ ఎండీ సంజయ్‌ చంద్ర, ఆయన సోదరుడు అజయ్‌ చంద్రలను ఆర్థిక నేరాల విభాగం ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్ట్‌ చేసింది. సంజయ్‌ చంద్ర, అజయ్‌ చంద్రలను బెయిల్‌ కోసం డిసెంబర్‌లోగా రూ.750 కోట్లు డిపాజిట్‌ చేయాలంటూ అక్టోబర్‌ 30న సుప్రీం కోర్టు యూనిటెక్‌ని ఆదేశించింది.  

సుప్రీంకోర్టు ఆదేశాలకిది విరుద్ధం: యూనిటెక్‌
ఉదయం పూట వాదనల్లో పాల్గొనని యూనిటెక్‌.. మధ్యాహ్నం ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. సుప్రీం కోర్టులో తమ కేసు విచారణ జరుగుతోందని నివేదించింది. ఇతరత్రా న్యాయస్థానాలేవీ కంపెనీపై బలవంతంగా ఎటువంటి చర్యలకు ఆదేశాలు ఇవ్వరాదంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతిని తెలియజేసింది.

ఈ నేపథ్యంలో తాజా ఆదేశాలను పక్కనపెట్టాలని కోరింది. తాజా ఉత్తర్వుల వల్ల తాము సుప్రీం కోర్టుకు రూ. 750 కోట్లు డిపాజిట్‌ చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంది. అయితే, మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయడానికి ఎన్‌సీఎల్‌టీ నిరాకరించింది. సుప్రీం ఆదేశాలను పాటించడాన్ని బట్టి తాజా ఉత్తర్వుల అమలు ఉంటుందని స్పష్టం చేసింది. శుక్రవారం బీఎస్‌ ఈలో యూనిటెక్‌ షేర్‌ 20% లాభపడి రూ.7.29 దగ్గర ముగిసింది.

అప్పట్లో సత్యం.. ఇప్పుడు యూనిటెక్‌..
ప్రభుత్వం స్వయంగా ప్రైవేట్‌ కంపెనీ యాజమాన్య బాధ్యతలను టేకోవర్‌ చేయడంపై దృష్టి పెట్టడం అరుదైన సందర్భం. సత్యం కంప్యూటర్స్‌ ఉదంతం తర్వాత ప్రభుత్వం మళ్లీ ఇలాం టి విషయంలో జోక్యం చేసుకోవడం ఇదే ప్రథమం. కంపెనీల చట్టం 2013లోని సెక్షన్‌ 241 కింద ఎంసీఏ పిటిషన్‌ దాఖలు చేసింది. సెక్షన్‌ 241 (2) ప్రకారం.. ఏదైనా కంపెనీ వ్యవహారా లు ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించేవిగా ఉన్నాయని భావించిన పక్షంలో సదరు సంస్థ యాజమాన్య బాధ్యతలు తనకు దఖలుపడేలా ఆదేశాలివ్వాలంటూ.. కేంద్ర ప్రభుత్వం ఎన్‌సీఎల్‌టీని తనంతట తానే స్వయంగా ఆశ్రయించవచ్చు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top