
సాక్షి,న్యూఢిల్లీ: ఉల్లి ధరలకు చెక్ పెట్టేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఎంఎంటీసీ ద్వారా 2000 టన్నుల ఉల్లి దిగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు సరఫరాలు పెంచి ధరలకు కళ్లెం వేసేందుకు దేశీయ మార్కెట్ల నుంచి నాఫెడ్,ఎస్‌ఎఫ్‌ఏసీలు 12,000 టన్నుల ఉల్లిని కొనుగోలు చేసేందుకు సంసిద్ధమయ్యాయని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రాం విలాస్ పాశ్వాన్ పేర్కొన్నారు.
ఉల్లి ఎగుమతులను నియంత్రించేందుకు కనిష్ట ఎగుమతి ధరను తిరిగి విధించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరామని చెప్పారు. ఉల్లి సరఫరాలు తగ్గడంతో దేశంలోని పలు చోట్ల ఉల్లి ధరలు కిలో రూ 50-65 మధ్య పలుకుతున్నాయి. ధరలకు చెక్ పెట్టేందుకు 12,000 టన్నుల ఉల్లిని సేకరించాలని తాము నాఫెడ్, ఎస్‌ఎఫ్‌ఏసీలను కోరామని చెప్పారు. ఉల్లి సరఫరాలను పెంచి ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు.