విండ్ షీల్డ్స్‌తో ‘మహీంద్ర’ పీపీఈలు

Michigan Mahindra plant makes medical shields from windshields - Sakshi

సాక్షి, న్యూఢిల్లీభారత్‌కు చెందిన మహీంద్రా గ్రూప్ కరోనా వైరస్ మహమ్మారి పోరులో అగ్రభాగాన నిలుస్తున్న వైద్య సిబ్బంది రక్షణ నిమిత్తం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని సౌత్ఈస్ట్ మిచిగాన్‌లో మహీంద్రా ఆబర్న్ హిల్స్ ప్లాంట్ లో వైద్య సిబ్బందికి అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలను (పీపీఈ) తయారు చేయడానికి రంగంలోకి దిగింది. వినూత్న పద్ధతిలో వీటి తయారీకి ఉపక్రమించింది. ఇందుకు మహీంద్రా గ్రూప్ మిచిగాన్‌లో జనరల్ మోటార్స్, ఫోర్డ్ మోటార్స్ కంపెనీలతో జత కలిసింది. 

మహీంద్రా  రాక్సోర్ వాహనాల్లో వాడే విండ్ షీల్డ్స్ తయారు చేసే పదార్థంతో ఫేస్ షీల్డ్స్, మాస్క్ లు, ఆస్పిషన్ బాక్సులను తయారు చేస్తోంది. విండ్‌షీల్డ్స్‌లో ఉపయోగించే పాలికార్బోనేట్ పదార్థంతోనే ఈ పెట్టెలను తయారుచేస్తున్నామని కంపెనీ తెలిపింది. ఇవి కోవిడ్-19 బారిన పడిన రోగి ఇంట్యుబేషన్ గొట్టాలను తొలగిస్తున్నపుడు, వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి ఇవి రక్షణ కవచంగా ఉపయోగపడతాయని నార్త్ అమెరికా మహీంద్రా ఆటోమోటివ్  సీఈవో రిక్ హాస్ వెల్లడించారు. ఈ పరికరాల తయారీలో ఆబర్న్ హిల్స్ ప్లాంట్‌ కు చెందిన ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తున్నారనీ,  సంక్షోభ సమయంలో ఫ్రంట్‌లైన్ కార్మికులకు అవసరమైన ఉత్పత్తులను అందించడంలో ఇదొక వినూత్న విధానమని ఆయన పేర్కొన్నారు.  (కరోనా : అమెజాన్‌లో 75 వేల ఉద్యోగాలు)

అత్యంత కఠినమైన పదార్థం కావడంతో  పగలకుండా, ఇతర ప్లాస్లిక్ ల మాదిరిగా ఫాగ్ చేరకుండా వుంటుందని తెలిపారు. క్రిటికల్ కేర్ ఫెసిలిటీలో పనిచేసే మహీంద్రా ఉద్యోగి భార్య ఈ బాక్సులను తయారు చేయాలని సూచించారట. ఈ సూచనను పరిగణనలో తీసుకొని పరీక్షించిన కంపెనీ ఐదు వెర్షన్లను డిజైన్ చేసింది. దీంతో వైరస్ కారణంగా ఒక నెల క్రితం మూసివేసిన ఈ ప్లాంట్ సుమారు 10 రోజులుగా వీటిని తయారు చేస్తూనే ఉంది. తద్వారా 2వేల మందికి ఉపాది లభించిందని  రిక్ హాస్ వెల్లడించారు. ఈ సంక్షోభ సమయంలో ఫ్రంట్‌లైన్ కార్మికులకు అవసరమైన ఉత్పత్తులను పొందడానికి స్థానికంగా మిచిగాన్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం, వాణిజ్య సంస్థలు, ఓక్లాండ్ కౌంటీ, స్థానిక వ్యాపారాలతో కలిసి పనిచేస్తోందన్నారు. తమ కంపెనీ ఉత్పత్తికి దేశవ్యాప్తంగా(అమెరికా), అంతర్జాతీయంగా ఆసక్తి లభిస్తోందని, డిజైన్లను భారతదేశంలో తయారీకి అనువుగా సంస్థ ప్రధాన కార్యాలయానికి పంపించామని చెప్పారు.(హెచ్-1 బీ వీసాదారులకు భారీ ఊరట)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top