మల్వీందర్, గోధ్వానీకి  ఎన్‌సీఎల్‌టీ నోటీసులు

 Malvinder gets NCLT notice - Sakshi

న్యూఢిల్లీ: ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్‌ ఎండీ మల్వీందర్‌ సింగ్, రెలిగేర్‌ మాజీ చీఫ్‌ సునీల్‌ గోధ్వానీ తదితరులకు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) గురువారం నోటీసులు జారీ చేసింది. కంపెనీ షేర్‌హోల్డింగ్, బోర్డు వ్యవహారాల్లో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్‌ లావాదేవీల్లో మల్వీందర్‌ సింగ్‌ అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆయన సోదరుడు శివీందర్‌ సింగ్‌ వేసిన పిటిషన్‌పై విచారణలో భాగంగా ఎన్‌సీఎల్‌టీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్‌ రికార్డులను తనిఖీ చేసేందుకు, అవసరమైన పత్రాల ఫొటోకాపీలు తీసుకునేందుకు శివీందర్‌ సింగ్, ఆయన భార్య అదితి సింగ్‌తో పాటు మల్వీందర్‌ సింగ్‌లకు అనుమతులిచ్చింది.  పది రోజుల్లోగా తమ సమాధానాలు తెలియజేయాలంటూ మల్వీందర్‌ సింగ్‌ తదితరులకు ట్రిబ్యునల్‌ ఆదేశించింది. అలాగే శివీందర్‌ సింగ్‌ కూడా రెండు వారాల్లోగా రిజాయిండర్‌ దాఖలు చేయాలంటూ సూచించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 9కి వాయిదా వేసింది. కుటుంబ వ్యాపారాల నిర్వహణలో మల్వీందర్‌ సింగ్‌ అవకతవకలకు పాల్పడ్డారని, సంస్థలను అప్పుల్లో ముంచేశారని ఆరోపిస్తూ ఆయన తమ్ముడు శివీందర్‌ సింగ్‌ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top