ఎల్‌టీసీజీ పన్ను.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

 LTCG Tax What Investors Do? - Sakshi

నేను సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో 2,3 ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. అయితే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను మళ్లీ వచ్చింది కదా ! అందుకని ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఉన్న ఇన్వెస్ట్‌మెంట్స్‌ అన్నింటినీ అమ్మేసి, తిరిగి వేరే మ్యూచువల్‌ ఫండ్స్‌ కొనుగోలు చేయమంటారా ? లేకుంటే సిప్‌లను అలాగే కొనసాగించమంటారా ?     - నిరంజన్, హైదరాబాద్‌  

దీర్ఘకాల మూలధన లాభాల పన్ను(ఎల్‌టీసీజీ) మళ్లీ వచ్చింది. అయితే ఈ పన్ను కారణంగా మీ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అన్నింటినీ అమ్మేసి, మళ్లీ కొనుగోలు చేయనవసరం లేదు. ఈ ఏడాది జనవరి 31 వరకూ మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీకు వచ్చిన లాభాలపై ఎలాంటి పన్ను భారం ఉండదు. ఆ తర్వాతి కాలంలో వచ్చిన లాభాలపై మాత్రమే పన్ను ఉంటుంది. మీరు ఏప్రిల్‌ 1 తర్వాత విక్రయిస్తేనే, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎల్‌టీసీజీ విధింపు అందరి ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. అయితే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోని మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే లాభాలపై ఎల్‌టీసీజీ చాలా స్వల్పం. మీరు ఇన్వెస్ట్‌ చేసిన ఫండ్స్‌ మంచి పనితీరు కనబరుస్తున్నట్లయితే నిశ్చింతగా ఉండండి. మీ సిప్‌లను కొనసాగించండి. ఎల్‌టీసీజీ విధింపు కారణంగా ఎలాంటి మార్పులు, చేర్పులు చేయకండి.  

మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించి ఏమేం చార్జీల భారం ఇన్వెస్టర్లపై ఉంటుంది ? బయటకు కనిపించని చార్జీలు ఏమైనా ఉంటాయా? 
-రాజేశ్, విజయవాడ 

మ్యూచువల్‌ ఫండ్స్‌ చార్జీలన్నీ పారదర్శకంగానే ఉంటాయి. బయటకు కనిపించని చార్జీల భారం ఏమీ ఇన్వెస్టర్లపై ఉండదు. మీరు మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లు కొనుగోలు చేసేటప్పుడు ఒకే ఒక చార్జీ-ఎక్స్‌పెన్స్‌ రేషియో(దీంట్లోనే అన్ని చార్జీలూ కలసి ఉంటాయి) ఉంటుంది. ఈ ఎక్స్‌పెన్స్‌ రేషియోలోనే మేనేజ్‌మెంట్‌ ఫీజు, విక్రయాల వ్యయాలు, నిర్వహణ చార్జీలు, రిజిస్ట్రార్‌ ఫీజు, కస్టోడియన్‌ ఫీజు, ఇతర వ్యయాలు కలసి ఉంటాయి. ఒకే మ్యూచువల్‌ ఫండ్‌కు సంబంధించిన రెగ్యులర్‌ ప్లాన్‌కు, డైరెక్ట్‌ ప్లాన్‌కు ఈ ఎక్స్‌పెన్స్‌ రేషియో వేర్వేరుగా ఉండొచ్చు. సాధారణంగా ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌కు ఎక్స్‌పెన్స్‌ రేషియో 2.5 శాతం నుంచి 2.65 శాతం రేంజ్‌లో ఉంటుంది. ఇదే మ్యూచువల్‌ ఫండ్‌ డైరెక్ట్‌ ప్లాన్‌కు అయితే ఎక్స్‌పెన్స్‌  రేషియో 50-75 బేసిస్‌ పాయింట్లు తక్కువగా ఉంటుంది. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు ఎక్స్‌పెన్స్‌ రేషియో ఇంకా తక్కువగా ఉంటుంది. ఇక తర్వాత ఎగ్జిట్‌ లోడ్‌ ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ను మీరు కొనుగోలు చేసిన ఏడాదిలోపే విక్రయిస్తే ఎగ్జిట్‌ లోడ్‌ చెల్లించాల్సి ఉంటుంది. వివిధ రకాల ఫండ్స్‌కు ఈ టైమ్‌ పీరియడ్‌ వేర్వేరుగా ఉంటుంది. డెట్‌ ఫండ్స్‌ యూనిట్లను కొనుగోలు చేసిన నెల రోజులు, మూడు నెలలలోపు విక్రయిస్తే, వాటిపై కూడా ఎగ్జిట్‌ లోడ్‌ ఉంటుంది. లిక్విడ్‌ ఫండ్స్‌కు అయితే ఎలాంటి ఎగ్జిట్‌ లోడ్‌ ఉండదు. ఎగ్జిట్‌ లోడ్‌ మళ్లీ మ్యూచువల్‌ ఫండ్‌లోకే వస్తుంది. ఇది మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థకు వెళ్లదు. మ్యూచువల్‌ ఫండ్‌లోని  ఇతర ఇన్వెస్టర్లకు ఇది ప్రయోజనం కలిగించే విషయమే.  

నా వయసు 25 సంవత్సరాలు. ఇటీవలే ఉద్యోగంలో చేరాను. మార్కెట్‌ గరిష్ట స్థాయిల్లో ఉన్నప్పుడు మాలాంటి యువ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్‌ చేయవచ్చా ? లేక మార్కెట్‌ పడేంత వరకూ ఎదురు చూడాలా? 
- అనంత్, విశాఖపట్టణం  

మీరు యువకులు. టైమ్‌ అంతా మీ చెంతనే ఉంటుంది. అందుకని ముందుగా ఏదైనా కన్సర్వేటివ్‌ ఫండ్‌ను ఎంచుకోండి. దాంట్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌ చేయడం కొనసాగించండి. ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయకండి. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తే, దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందే అవకాశాలు అధికంగా ఉంటాయి. మార్కెట్‌ గరిష్ట స్థాయిలో ఉందా, పతన బాటలో ఉందా అన్న విషయాన్ని పక్కన బెట్టి, మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. 2016, 2017ల్లో కూడా మార్కెట్‌ గరిష్ట స్థాయిల్లోనే ఉంది. చాలా మంది ఇన్వెస్టర్లు మార్కెట్‌ పతనమైన తర్వాత ఇన్వెస్ట్‌ చేద్దామనే ఉద్దేశంతో ఎదురు చూశారు. కానీ, మార్కెట్‌ పడకపోగా, మరింతగా పెరిగింది. దీర్ఘకాలం దృష్ట్యా చూస్తే, మార్కెట్‌ పతనం జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. మీరు యువకులు కాబట్టి, మార్కెట్‌ అంటే భయపడవద్దు. మీకు మరో ఐదేళ్లపాటు అవసరం లేని సొమ్ములనే షేర్లలోనూ, మ్యూచువల్‌ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్‌ చేయాలి. ముందుగా బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌  చేయడం ప్రారంభించండి. ఇలా మూడేళ్ల పాటు క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత మీకు మ్యూచువల్‌ ఫండ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్‌పై తగిన అవగాహన వస్తుంది. అప్పుడు మీరు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి స్వయంగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ఇతరులకు సలహాలు ఇచ్చే స్థాయికి వస్తారు. సొంత ఇల్లు సమకూర్చుకోవడం, పిల్లల ఉన్నత విద్యావసరాలు, రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు తదితర దీర్ఘకాల ఆర్థిక అవసరాల కోసం చిన్న వయసు నుంచే ఇన్వెస్ట్‌ చేయడం ప్రారంభిస్తే, దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు. మరోవైపు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కూడా తీసుకోవాలి. సాధారణ జీవిత బీమా పాలసీలతో పోల్చితే టర్మ్‌ బీమా పాలసీల్లో చెల్లించాల్సిన ప్రీమియమ్‌ తక్కువగానూ, బీమా కవరేజ్‌ అధికంగానూ ఉంటుంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top