కొత్త మైనింగ్‌ కంపెనీలకు వర్తించదు | Sakshi
Sakshi News home page

కొత్త మైనింగ్‌ కంపెనీలకు వర్తించదు

Published Fri, Dec 6 2019 12:19 AM

Lok Sabha Passes Bill To Effect Corporate Tax Reduction Says Nirmala Sitharaman - Sakshi

న్యూఢిల్లీ: కార్పొరేట్‌ పన్నుల భారం తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి గురువారం పార్లమెంటు ఆమోదముద్ర పడింది. ఇందుకు సంబంధించి జారీ చేసిన ఆర్డినెన్స్‌ స్థానంలో తీసుకువచ్చిన ట్యాక్సేషన్‌ లాస్‌ (అమెండ్‌మెంట్‌) బిల్లు, 2019కు పార్లమెంటు ఓకే చెప్పింది. ఈ సందర్భంగా రాజ్యసభలో జరిగిన చర్చలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ మాట్లాడుతూ, కొత్తగా ఏర్పాటు చేసే తయారీ రంగ కంపెనీలకు 15 శాతం కార్పొరేట్‌ ట్యాక్స్‌ విధించే అంశంపై  స్పష్టతనిచ్చారు.  మైనింగ్‌ కంపెనీలు, సాఫ్ట్‌వేర్‌డెవలపర్లు, బుక్‌ ప్రింటర్లకు కొత్త తయారీ కంపెనీలకు వర్తించే ‘కనిష్ట 15 శాతం పన్ను రేటు’ వర్తించబోదని ఉద్ఘాటించారు.

నెగిటివ్‌ జాబితా రూపకల్పన... 
కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేటును కంపెనీలకు 30 శాతం నుంచి 22 శాతానికి, కొన్ని కొత్త తయారీ సంస్థలకు 25 శాతం నుంచి 15 శాతానికి కేంద్రం సెప్టెంబర్‌లో తగ్గించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 20న ఈ మేరకు ఆర్థికమంత్రి ఒక ప్రకటన చేశారు.  దీని ప్రకారం ఈ ఏడాది అక్టోబర్‌ తరువాత ప్రారంభించి 2023 నాటికి కార్యకలాపాలు ప్రారంభించే కొత్త తయారీ రంగ కంపెనీలకు కనిష్టంగా 15 శాతం రేటును వర్తిస్తుంది.  ఇందుకు సంబంధించి వెంటనే ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. ఆర్డినెన్స్‌ స్థానంలో తీసుకువచ్చిన బిల్లుకు ఈ వారం మొదట్లోనే లోక్‌సభ ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసింది.

పెద్దల సభ కూడా బిల్లులో ఎటువంటి మార్పూ చేయకుండా వెనక్కు పంపడంతో బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడినట్లయ్యింది.  రాజ్యసభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటన ప్రకారం– ట్యాక్సేషన్‌ చట్ట సవరణ బిల్లు 2019 ప్రకారం కొన్ని సంస్థలను నెగిటివ్‌ జాబితా ఉంచారు. ఈ జాబితాలో ఉంచిన సంస్థలు తయారీ రంగం పరిధిలోనికి రావని, వీటికి కనిష్ట 15 శాతం బేస్‌ రేటు వర్తించదని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు.  ఇందులో  మైనింగ్‌ కంపెనీలు, సాఫ్ట్‌వేర్‌డెవలపర్లు, బుక్‌ ప్రింటర్లు ఉన్నట్లు వివరణ ఇచ్చారు. వీటితోపాటు స్లాబ్స్‌లో వినియోగించే మార్బుల్‌ బ్లాక్స్, సిలిండర్‌లోకి గ్యాస్‌ రీఫిల్లింగ్, సినిమాటోగ్రాఫ్‌ ఫిల్మ్‌ ఉత్పత్తి కూడా నెగిటివ్‌ లిస్ట్‌లో ఉన్నాయి.

ఆర్థిక వృద్ధి లక్ష్యంగా... 
ఆర్థికవృద్ధే లక్ష్యంగా కార్పొరేట్‌ పన్నులను తగ్గించినట్లు ఆర్థికమంత్రి తెలిపారు. వృద్ధికి ఊతం ఇవ్వడం లక్ష్యంగా కేంద్రం పలు చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రభుత్వ యంత్రాంగ ంలో అలసత్వ నిరోధం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) ప్రోత్సాహం, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం వంటి పలు చర్యలు ఈ దిశలో ఉన్నాయన్నారు. కార్పొరేట్‌ పన్ను తగ్గింపువల్ల పెట్టుబడులకు భారత్‌ ఆకర్షణీయ దేశంగా అవతరిస్తోందని వివరించారు. ఆర్థికరంగం పునరుత్తేజమే ధ్యేయంగా కేంద్రం తన చర్యలను కొనసాగిస్తుందని తెలిపారు.

Advertisement
Advertisement