ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ను దివాలా తియ్యనివ్వం

LIC may buy more stake in IL&FS - Sakshi

న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ను కుప్పకూలనివ్వబోమని, సంస్థను నిలబెట్టేందుకు అన్ని విధాలా తోడ్పాటు అందిస్తామని ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) చైర్మన్‌ వీకే శర్మ చెప్పారు. అవసరమైతే సంస్థలో వాటాలు మరింత పెంచుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌లో ఎల్‌ఐసీకి నాలుగో వంతు వాటా ఉంది.

ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌లో భాగమైన ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ... వాణిజ్య పత్రాల రుణాల చెల్లింపు డిఫాల్ట్‌ కావడంతో ఎన్‌బీఎఫ్‌సీల ఆర్థిక పరిస్థితులపై ఇన్వెస్టర్లలో ఆందోళన తలెత్తడం, ఆ ప్రభావంతో స్టాక్‌ మార్కెట్‌ భారీగా పతనం కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శర్మ తాజా వ్యాఖ్యలు చేశారు.

‘ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ దివాలా తియ్యకుండా అన్ని చర్యలూ తీసుకుంటాం. ఈ సంక్షోభం మరింతగా విస్తరించకుండా చూస్తాం. సంస్థలో వాటాలు పెంచుకోవడం సహా అన్ని అవకాశాలూ పరిశీలనలో ఉన్నాయి‘ అని ఆయన చెప్పారు. దేశంలోనే అత్యంత పొడవైన టనెల్‌ (జమ్మూ కాశ్మీర్‌లో చెనాని–నాష్రి) నిర్మించిన ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ప్రస్తుతం రూ. 91,000 కోట్ల పైచిలుకు రుణభారంతో కుంగుతోంది.

ఐఈఐఎస్‌ఎల్‌ డౌన్‌గ్రేడ్‌..
తీవ్ర సంక్షోభంలో ఉన్న ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీలను రేటింగ్‌ ఏజెన్సీలు డౌన్‌గ్రేడ్‌ చేయడం కొనసాగుతోంది. తాజాగా ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ సర్వీసెస్‌ (ఐఈఐఎస్‌ఎల్‌) దీర్ఘకాలిక ఇష్యూయర్‌ రేటింగ్‌ను ఇండియా రేటింగ్స్‌ సంస్థ డౌన్‌గ్రేడ్‌ చేసింది. అలాగే సంస్థ జారీ చేసే వివిధ డెట్‌ సాధనాలను కూడా ’బీబీ’ గ్రేడ్‌కు తగ్గించింది.

ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు.. ఐఈఐఎస్‌ఎల్‌ కొత్తగా ఈక్విటీ.. డెట్‌ సమీకరించుకునే అంశానికి సంబంధించి ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొంది.  ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ రుణాల్లో కొంత భాగాన్ని చెల్లించేందుకు ఐఈఐఎస్‌ఎల్‌ ప్రస్తుతం రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ. 238 కోట్లు సమీకరించే ప్రయత్నాల్లో ఉన్న తరుణంలో ఈ డౌన్‌గ్రేడ్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. రుణాల డిఫాల్ట్‌ నేపథ్యంలో మరో రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా ఇప్పటికే ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌లోని పలు కంపెనీల రేటింగ్స్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసిన సంగతి తెలిసిందే.  

షేర్లు రయ్‌..
సంస్థను నిలబెట్టేందుకు అన్ని విధాలుగా తోడ్పాటునిస్తామంటూ ఎల్‌ఐసీ హామీ ఇచ్చిన దరిమిలా మంగళవారం ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీల షేర్లు పెరిగాయి. బీఎస్‌ఈలో ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ 12 శాతం, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్స్‌ 5.74 శాతం పెరిగాయి. అయితే, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ మాత్రం స్వల్పంగా 0.13 శాతం క్షీణించింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top