భిలాయ్ యూనిట్‌పై ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలు
న్యూఢిల్లీ: జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) తాజాగా భిలాయ్ జేపీ సిమెంట్‌పై దివాలా చట్ట చర్యలకు ఆదేశించింది. ఇప్పటికే రుణ సంక్షోభంలో చిక్కుకున్న జేప్రకాష్ అసోసియేట్స్(జేఏఎల్) అనుబంధ సంస్థ ఇది. రూ. 45 కోట్ల చెల్లింపుల్లో విఫలమైన నేపథ్యంలో భిలాయ్ జేపీ సిమెంట్‌పై దివాలా చర్యలకు ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలు జారీ చేసింది.
బొగ్గు సరఫరాకు సంబంధించి రూ. 45 కోట్లు బకాయిపడటంతో భిలాయ్ జేపీ సిమెంట్‌పై సిధ్గిరి హోల్డింగ్స్ ప్రయివేట్ లిమిటెడ్ దాఖలు చేసిన ఫిర్యాదును ఎన్‌సీఎల్‌టీ కటక్ బెంచ్ ఆమోదించింది. దీంతో ఇద్దరు సభ్యుల ఎన్‌సీఎల్‌టీ బెంచ్ తాత్కాలిక దివాల పరిష్కార నిపుణుడిని ఎంపిక చేసింది. అంతేకాకుండా కంపెనీ బోర్డును రద్దు చేయడంతోపాటు.. ఇతర దివాల చట్ట సంబంధిత చర్యలకు ఆదేశించింది.


