
డ్యామ్ ప్రమాద స్థితిలో ఉందని హెచ్చరించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ
డ్యాం భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం
శ్రీశైలం ప్రాజెక్టులోగనుక విపత్తు సంభవిస్తే మూడు జిల్లాలకు దెబ్బ
అదే జరిగితే అమరావతి కట్టడాలకూ తీవ్ర నష్టం
ఇప్పటికైనా శ్రీశైలం డ్యామ్‌కు మరమ్మతులు చేపట్టాలి
బహిరంగ లేఖలో సీఎంను హెచ్చరించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి శర్మ
సాక్షి, విశాఖపట్నం: శ్రీశైలం డ్యామ్ ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) హెచ్చరించినా ఇంతవరకు ఎందుకు మరమ్మతులు చేపట్టలేదని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఘాటుగా ప్రశ్నించారు. ఈ అంశంపై తక్షణమే స్పందించాలని కోరుతూ ఈ ఏడాది మార్చి 7న ఓ లేఖ రాసినా.. ఎందుకు స్పందించలేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి శనివారం మరోసారి శర్మ బహిరంగ లేఖాస్త్రం సంధించారు. 2012లో కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన వరద వల్ల డ్యామ్ క్రమక్రమంగా ప్రమాద స్థితికి చేరుకుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
చంద్రబాబుకు రాసిన లేఖలో శర్మ ఏం చెప్పారంటే... ‘2014లోనూ అప్పటి టీడీపీ ప్రభుత్వం డ్యామ్ ప్రమాదకర స్థితిలో ఉన్న విషయాన్ని పట్టించుకోలేదు. ఏడాది క్రితం ఎన్‌డీఎస్‌ఏ మరోసారి హెచ్చరించినా.. ఎందుకు స్పందించలేదు.? తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిని పట్టించుకోవడం లేదు. శ్రీశైలం డ్యామ్ కింద వైపున.. పునాదికి దగ్గరలో పెద్ద ఎత్తున కోతకు గురైంది. దీని వల్ల డ్యామ్ కట్టడానికి ముప్పు ఉందని, 2025 వర్షా కాలంలోగా తాము సూచించిన తాత్కాలిక మరమ్మతులు తక్షణమే చేపట్టాలంటూ ఎన్‌డీఎస్‌ఏ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. ఇంత వరకూ మీ ప్రభుత్వం అలాంటి మరమ్మతులేవీ చేపట్టలేదు. దీనిపై ఎన్‌డీఎస్‌ఏ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
తాత్కాలిక మరమ్మతులతోపాటు దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని, పునాది కింద ఏర్పడిన భౌగోళిక మార్పులపై నిపుణుల సహాయంతో అధ్యయనం చేసి త్వరగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కూడా ఎన్‌డీఎస్‌ఏ చెప్పింది. అయినా ఏమాత్రం స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో గనుక విపత్తు సంభవిస్తే.. కృష్ణానది కింద ఉన్న ప్రాంతాలు అంటే నాగార్జున సాగర్ డ్యామ్‌కు, గుంటూరు, నల్గొండ, కృష్ణా జిల్లాలకు ముంపు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. వందలాది గ్రామాలు నీటమునిగిపోతాయి. విజయవాడ, గుంటూరు నగరాలే కాకుండా.. కొత్తగా నిర్మిస్తున్న అమరావతి కట్టడాలకూ ముంపు ముప్పు వాటిల్లక తప్పదు.
వాతావరణ మార్పుల వల్ల రాష్ట్రంలోని అన్ని నదుల్లోనూ వర్షాకాలంలో ప్రమాద స్థాయిలో వరద వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా శ్రీశైలం డ్యామ్‌కి మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టండి. ఎన్‌డీఎస్‌ఏ హెచ్చరికలకు అనుగుణంగా.. డ్యామ్ పనుల్ని సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ) నిపుణుల పర్యవేక్షణలో చేపట్టాలి. అని ఈఏఎస్ శర్మ బాబుకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.