కోటక్‌ బ్యాంక్‌ లాభం 23% అప్‌..

 Kotak Mahindra Bank Q3 results today; What to expect - Sakshi

క్యూ3లో రూ. 1,291 కోట్లు

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో(క్యూ3) 23% ఎగిసింది. రుణాల వృద్ధి, నికర వడ్డీ ఆదాయం, మార్జిన్లు మెరుగుపడటం ఇందుకు తోడ్పడింది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన క్యూ3లో నికర లాభం రూ. 1,291 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి లాభం రూ. 1,053 కోట్లుగా ఉంది.  ఆదాయం రూ.6,049 కోట్ల నుంచి రూ. 7,214 కోట్లకు పెరిగింది. మూడో త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 23% వృద్ధితో రూ. 2,394 కోట్ల నుంచి రూ. 2,939 కోట్లకు పెరిగిందని, మార్జిన్‌ 4.33%గా నమోదైందని బ్యాంకు జాయింట్‌ ఎండీ దీపక్‌ గుప్తా తెలిపారు. ఇక కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన లాభం 13.5% వృద్ధితో రూ. 1,624 కోట్ల నుంచి రూ. 1,844 కోట్లకు చేరింది. ఆదాయం రూ. 10,104 కోట్ల నుంచి రూ. 11,347 కోట్లకు పెరిగింది. సమీక్షా కాలంలో స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏ) 2.31% నుంచి 2.07%కి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 1.09% నుంచి 0.71%కి తగ్గాయి. 

ఎస్‌ఎంఈ రుణాల తగ్గుదల..
అసంఘటిత రంగం ఇంకా డీమోనిటైజేషన్, జీఎస్‌టీ అమలు ప్రభావాల నుంచి తేరుకోవాల్సి ఉన్నందున.. చిన్న, మధ్య తరహా సంస్థలకు రుణాలివ్వడం కొంత తగ్గించినట్లు గుప్తా తెలిపారు.  అటు బ్యాంకులో ప్రమోటర్ల షేర్‌ హోల్డింగ్‌కి సంబంధించిన వివాదంపై కోర్టులో విచారణ కొనసాగుతోందని, దీనిపై ఆర్‌బీఐ నుంచి తమకేమీ సూచనలు రాలేదని గుప్తా చెప్పారు. బయోమెట్రిక్స్‌ ఆధారంగా ఖాతాలను తెరవడంపై ఆంక్షల నేపథ్యంలో ప్రత్యామ్నాయ అవకాశాలు పరిశీలిస్తున్నామన్నారు. ప్రస్తుతం రోజుకు 5,000 పైచిలుకు పొదుపు ఖాతాలు తెరుస్తున్నామని చెప్పారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top