
న్యూఢిల్లీ: సాఫ్ట్ బ్యాంకు 100 బిలియన్ డాలర్ల విజన్ ఫండ్ నిర్వహణ బాధ్యతలను ఫేస్‌బుక్ నుంచి తీసుకుంటున్న కీర్తిగారెడ్డికి అప్పగిస్తోంది. విశేషమేమిటంటే సాఫ్ట్‌బ్యాంకు ఓ మహిళను ఈ బాధ్యతల కోసం ఎంపిక చేయటం ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ పెట్టుబడులకు సంబంధించి సాఫ్ట్‌బ్యాంకు గ్రూపు పరిధిలో 12 ఫండ్స్ ఉన్నాయి. ‘‘సాఫ్ట్‌బ్యాంకు ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్‌లో కీర్తిగారెడ్డి చేరారు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఫండ్‌ను ఆమె నిర్వహిస్తారు.
సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ దీప్ నిషార్‌తో కలసి పనిచేస్తారు’’ అని సాఫ్ట్‌బ్యాంకు ప్రతినిధి తెలియజేశారు. కీర్తిగారెడ్డి భారత్, అమెరికాల్లో ఫేస్‌బుక్ కోసం పనిచేశారు. స్టాండర్డ్ బిజినెస్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బోర్డులోనూ పనిచేస్తున్నారు. సాఫ్ట్‌బ్యాంకు విజన్ ఫండ్‌కు ఉబెర్ టెక్నాలజీస్, వివర్క్, చైనాకు చెందిన దీదీ చుక్సింగ్ తదితర బడా సంస్థల్లో వాటాలున్నాయి. విజన్ ఫండ్ పార్ట్‌నర్లలో అందరూ మగవారే ఉండడంపై గత సెప్టెంబర్‌లో సాఫ్ట్‌బ్యాంకు వ్యవస్థాపకుడు మసయోషి సన్ ఓ ప్రశ్న ఎదుర్కొన్నారు. అయితే, తనకు ఎవరి పట్లా వివక్ష లేదని ఆ సందర్భంలోనే స్పష్టం చేశారు.