ప్యాకేజీ–8.. సవాళ్లూ ‘భారీ’వే!

Kaleshwaram project in Telangana set to create world record by lifting 3 tmcft water/day - Sakshi

ప్రతిచోటా ఒక కొత్త అనుభవం...

అయినా... గడువులోగా పూర్తి చేసేందుకు కృషి

కాళేశ్వరంలో మా పనుల వాటా రూ.40 వేల కోట్లు

గతేడాది 3 బిలియన్‌ డాలర్ల టర్నోవర్‌ సాధించాం

ఎంఈఐఎల్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి వెల్లడి

ప్యాకేజీ–8లో 40 శాతం ‘భెల్‌’ భాగస్వామ్యమే

మీడియా ప్రతినిధుల సందర్శనలో వ్యాఖ్యలు  

భూమికి 333 మీటర్ల లోతున ఓ పెద్ద  షాపింగ్‌ మాల్‌ ఉంటే..! ఇది అంతకంటే భారీ నిర్మాణమే. 65 మీటర్ల ఎత్తయిన రాతి ట్యాంక్‌. సొరంగం ద్వారా నీరు ఆ ట్యాంక్‌లోకి చేరుతుంది. అక్కడి నుంచి అత్యంత భారీ  పంపులు, మోటార్ల సాయంతో దాదాపు 117 మీటర్ల పైకి వస్తాయి. వీటిని ఆపరేట్‌ చేయటానికి ఆ భూగర్భంలోనే భారీ నాలుగంతస్తుల సముదాయమూ ఉంది.  

క్లుప్తంగా... కాళేశ్వరం ప్యాకేజీ–8 ఇదే. ‘సర్జ్‌ పూల్‌’గా పిలుస్తున్న ఆ ట్యాంక్‌లు మూడున్నాయి. వీటిలో 2 కోట్ల లీటర్ల నీళ్లు నిల్వ ఉంటాయి. పలు ఇంజనీరింగ్‌ విశిష్టతలతో రాష్ట్రానికి చెందిన మేఘ ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా (ఎంఈఐఎల్‌) చేపడుతున్న ఈ ప్రాజెక్టును సోమవారం రాష్ట్ర, జాతీయ మీడియా ప్రతినిధులు సందర్శించారు. మోటార్లు, పంప్‌లు, ఇతర పరికరాలు సరఫరా చేసిన భెల్, నిర్మాణం చేపట్టిన ‘మేఘ’ సంస్థలు ప్రాజెక్టు విశేషాల్ని ఈ సందర్భంగా వివరించాయి.  

కాళేశ్వరం ప్యాకేజీ–8లో భాగంగా రామడుగు వద్ద నిర్మిస్తున్న భారీ భూగర్భ టన్నెల్, అక్కడే నిర్మించిన సర్జ్‌పూల్‌లు... వీటిలోని నీటిని పంప్‌ చేసేందుకు 139 మెగావాట్ల చొప్పున ఏర్పాటవుతున్న 7 పంప్‌లు... 600 టన్నుల బరువుండే మోటార్లు...  ఇవన్నీ ఇతర ఏ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌లోనూ కనిపించకపోవచ్చు. ఈ ఏడు పంపుల ద్వారా ఏక కాలంలో 21 వేల క్యూసెక్కుల నీటిని పంప్‌ చేయొచ్చు కూడా.

24 గంటలూ పనులు జరుగుతున్నాయని, జాప్యం నివారించడానికి... కీలక ఎలక్ట్రో–మెకానికల్‌ పరికరాల్ని ఖర్చుకు వెనకాడకుండా విమానాల్లో తెప్పిస్తున్నామని ఎంఈఐఎల్‌ డైరెక్టర్‌ పి.శ్రీనివాస రెడ్డి చెప్పారు. మోటార్లను భోపాల్‌లో తయారు చేశామని, షాఫ్ట్‌లు, పంప్‌లు కూడా ఆలస్యం లేకుండా అందిస్తున్నామని ‘భెల్‌’ సాంకేతిక సలహాదారు నరేంద్ర కుమార్‌ తెలియజేశారు.

‘‘భెల్‌ సరఫరాల్ని జాప్యం లేకుండా తెచ్చి కమిషన్‌ చేయటానికి మా పాతికేళ్ల ఇంజనీరింగ్‌ అనుభవం పనికొస్తోంది. ఈ ప్యాకేజీ ఎన్నో సవాళ్లు విసిరింది. వాటిని ఛేదించుకుంటూ వచ్చాం. సాంకేతిక ఇబ్బందుల దృష్ట్యా 600 టన్నుల బరువుండే మోటార్లను భూగర్భంలోనే ఏర్పాటు చేయాల్సి వచ్చినా వెనకాడలేదు. 85 శాతం పని పూర్తయింది. మిగిలింది 4 నెలల్లో చేస్తాం’’ అని శ్రీనివాసరెడ్డి వివరించారు. ఈ ఒక్క ప్యాకేజీ–8 విలువే దాదాపు రూ.4,700 కోట్లు!!.

లింక్‌–2 ఈపీసీ... లింక్‌–1 బీఓక్యూ
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత అంచనా వ్యయం 80 వేల కోట్లు. వీటిలో దాదాపు 50 శాతం పనుల్ని మేఘ దక్కించుకుంది. ఏడు లింకులుగా విభజించిన ఈ పనుల్లో... లింక్‌–2 పనుల్ని ఈపీసీ పద్ధతిలో, లింక్‌–1 బీఓక్యూ పద్ధతిలో చేస్తున్నామని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈపీసీ పద్ధతిలో కాంట్రాక్టు రేటు ముందే నిర్ణయమవుతుంది. బీఓక్యూలో చేస్తున్న పనులకు తగ్గ బిల్లుల్ని ప్రభుత్వం చెల్లిస్తుంటుంది. ‘‘లింక్‌–1లో మేం 3 లిఫ్ట్‌లు చేపట్టాం.

ఇందులో ప్యాకేజీ–8లోని భూగర్భ పంప్‌హౌస్‌తో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద  మూడు ఓపెన్‌ పంప్‌హౌస్‌ల నిర్మాణం కూడా ఉంది. అన్నీ 80–85 శాతం వరకూ పూర్తయ్యాయి. లింక్‌–2లో ప్యాకేజీ–6 పనులే చేపట్టాం. ఇక్కడ మరో నాలుగు నెలల్లో 7 పంపుల ఏర్పాటూ పూర్తవుతుంది’’ అని చెప్పారాయన. కావాల్సిన నిధుల్ని అంతర్గత వనరులు, బ్యాంకు రుణాల ద్వారా సమీకరిస్తున్నామన్నారు.

నిధుల కొరత లేదని, ఇప్పటికైతే పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లే  ఆలోచన కూడా లేదని చెప్పారాయన. భవిష్యత్తులో ఆ అవకాశాల్ని కొట్టి పారేయలేమన్నారు. తమ సంస్థకు రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌... ఏప్లస్‌ క్రెడిట్‌ రేటింగ్‌ ఇచ్చిందని గుర్తుచేశారు. ‘‘మా ఆర్డర్‌బుక్‌ రూ.60వేల కోట్లుంది. గడిచిన ఆరు నెలల్లోనే రూ.8 వేల కోట్ల ఆర్డర్లు కొత్తగా వచ్చాయి. ఇక 2017–18లో టర్నోవర్‌ 50% వృద్ధి చెంది 3 బిలియన్‌ డాలర్లకు చేరింది’’ అన్నారాయన.

ఇన్‌ఫ్రాతో పాటు గ్యాస్‌ సరఫరా, విద్యుత్, విమానయాన రంగాల్లోనూ తాము కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తు చేశారు. ‘‘దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు జాంబియా, టాంజానియా వంటి ఆఫ్రికా దేశాల్లోనూ పలు ప్రాజెక్టులు చేపట్టాం. 2017–18 ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 70 ప్రాజెక్టులు పూర్తి చేశాం’’ అని వివరించారు.

ఇవీ... సర్జ్‌పూల్‌ విశేషాలు
333 మీటర్ల లోతున భూగర్భంలో 65 మీటర్ల ఎత్తులో భారీ ట్యాంక్‌లా ఉండే ఈ పూల్‌ పూర్తిగా ఆటోమేషన్‌తో పనిచేస్తుంది. సర్జ్‌పూల్‌లో చేరిన నీటిని తోడి...  పూల్‌ వెనకాల 90 డిగ్రీల కోణంలో ఏర్పాటు చేసిన 117 మీటర్ల ఎత్తయిన పంప్‌ల ద్వారా పైనుండే పాండ్‌లోకి  పంప్‌ చేస్తారు.పంప్‌ ట్రిప్‌ అయినపుడు నీరు వెనక్కొచ్చి సర్జ్‌పూల్‌లో నీటి స్థాయి పెరిగి, ఆటోమేషన్‌ విభాగం మునిగిపోయే ప్రమాదముంది.

అందుకే...  ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తూ 3 పూల్స్‌ నిర్మించారు. వాటిలోకి నీరు సర్దుకుంటుంది. ప్రాజెక్టును చాన్నాళ్ల క్రితమే చేపట్టినా... ఈ పనులన్నీ మూడున్నరేళ్లలోనే చేసినట్లు శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వీటి పనితీరును నీరు లేకుండా ఇప్పటికే పరీక్షించామని, మరో రెండున్నర నెలల్లో నీటితో పరీక్షిస్తామని చెప్పారు. ఈ విద్యుత్‌ కోసం బయట 400 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు.    

- (మంథా రమణమూర్తి)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top