రూ.32.88 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు సిద్ధమైన కూటమి సర్కారు
పారిశ్రామికవేత్త కారుమంచి ప్రసాద్ భూములు, పరిశ్రమల కోసం నీటిని తరలించేలా చర్యలు
ఇది పూర్తయితే పర్చూరు, చీరాల, బాపట్ల, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు నీళ్లు హుళక్కే
ఎత్తిపోతలతో దిగువ భూములు ఎడారిగా మారతాయని రైతుల ఆందోళన
బాపట్ల, చీరాల పట్టణాలతోపాటు 50 గ్రామాల ప్రజల గొంతులు ఎండే పరిస్థితి
ఇప్పటికే దిగువ ఆయకట్టుకు ఏటా సాగునీటి ఇబ్బందులు
అమరావతి కేంద్రంగా పోరాటానికి సిద్ధమంటున్న రైతులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఓ పారిశ్రామికవేత్త ,అయన పరిశ్రమల కోసం చంద్రబాబు ప్రభుత్వం 50 గ్రామాలు, 1.20 లక్షల ఎకరాల సాగుకు గండి కొడుతోంది. పారిశ్రామికవేత్తకు కాలువనీర్చి..ప్రజలకు మురుగునీరు సరఫరా చేస్తామనంటోంది. పారిశ్రామికవేత్త కారుమంచి ప్రసాద్‌బాబు భూములు, పరిశ్రమల కోసం కూటమి ప్రభుత్వం కొమ్మమూరు కాలువపై గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని చినకాకుమాను వద్ద కొత్తగా ఎత్తిపోతల (లిఫ్ట్) పథకం నిర్మించి నీటిని మళ్లించేందుకు సిద్ధమవడంపై కాలువ దిగువ ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పథకం వల్ల దిగువ ప్రాంతంలో లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టు ఎడారిగా మారుతుందని.. బాపట్ల, చీరాల పట్టణాలతోపాటు 50 గ్రామాల పరిధిలో 5 లక్షల మందికి తాగునీరందక గొంతులెండుతాయని ఆందోళన చెందుతున్నారు. తక్షణం ప్రభుత్వం ఈ పథకాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మొండిగా ముందుకెళితే ఉద్యమానికి వెనుకాడబోమని రైతులు హెచ్చరిస్తున్నారు.
బుధవారం కొత్తపాలెం, నర్సాయిపాలెంలో రైతులు సమావేశాలు నిర్వహించి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి వ్యతిరేకంగా గళమెత్తారు. గురువారం స్వర్ణలో రైతులు సమావేశమై ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కరపత్రాలు ముద్రించి పంచుతున్నారు. ఈ నెల 8న కారంచేడులో భారీ సభ నిర్వహించనున్నారు. కాలువ పరిధిలో అన్ని గ్రామాల్లో రైతులతో కమిటీలు వేస్తున్నారు. ఈ పథకం నిర్మాణ ప్రతిపాదనలను నిలిపివేయకపోతే వేలాది రైతులతో అమరావతిలో ఆందోళనకు సిద్ధపడుతున్నారు.
లిఫ్ట్ నిర్మాణం వెనుక అసలు కథ ఇదీ
లిఫ్ట్ నిర్మిస్తున్న చినకాకుమానువద్ద ప్రసాద్ సీడ్స్ అధినేత కారుమంచి ప్రసాద్‌బాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులకు వందలాది ఎకరాల భూములు ఉన్నట్టు రైతులు చెబుతున్నారు. పైగా ప్రసాద్ చినకాకుమానులో త్వరలో పరిశ్రమ పెట్టబోతున్నారని, దాంతోపాటు విత్తనోత్పత్తి క్షేత్రాలు, ప్రాసెసింగ్ యూనిట్లను కూడా నెలకొల్పుతున్నారని సమాచారం.
ఇందుకోసం ఈ ప్రాంతంలో ఉన్న దాదాపు 5 వేల ఎకరాలలో కొంత భూమిని ఇప్పటికే కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. విత్తనోత్పత్తికి అవసరమైన మరిన్ని భూములను కౌలుకు తీసుకుంటున్నారని ఈ ప్రాంత రైతులు చెబుతున్నారు. తన భూములతోపాటు పరిశ్రమల నీటి అవసరాల కోసం కారుమంచి ప్రసాద్ ప్రభుత్వంలో తనకున్న పలుకుబడితో కొమ్మమూరు కాలువపై ఎత్తిపోతల పథకాన్ని నిరి్మస్తున్నారని రైతులు చెబుతున్నారు.
ప్రభుత్వం చెబుతున్న కథ ఏమిటంటే..
కొమ్మమూరు ప్రధాన కాలువ కుడిగట్టుపై గుంటూరు జిల్లా కాకుమాను మండలం చినకాకుమాను వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి 48.39 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం నాలుగు హై స్పీడ్ విద్యుత్ మోటార్లతో రెండు 135 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు ఉండే సబ్‌స్టేషన్‌తో దీనిని నిర్మిoచతలపెట్టారు. కొమ్మమూరు కాలువలో నీటిని వాడుకున్నందుకు ప్రతిగా సమీపంలోని నల్లమడ డ్రెయిన్ నుంచి అంతే మొత్తంలో మురుగు నీటిని మరో లిఫ్ట్ ద్వారా కొమ్మమూరులోకి ఎత్తిపోస్తామని ప్రభుత్వం చెబుతోంది.
పీ–4 పథకంలో భాగంగా చినకాకుమానుకు చెందిన ప్రసాద్ సీడ్స్ అధినేత కారుమంచి ప్రసాద్ ఈ పథకానికి రూ.10 కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం మిగిలిన రూ.23 కోట్లు తామే భరిస్తామని చెబుతోంది. ఈ లిఫ్ట్ వల్ల సుమారు 5 వేల ఎకరాలకు నీటిని అందించనున్నట్టు పేర్కొంటోంది.
సాగునీటికి కటకటే
కొమ్మమూరు ప్రధాన కాలువ పరిధిలో బాపట్ల, పర్చూరు, చీరాల, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో 50 గ్రామాల పరిధిలో దాదాపు 1.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాల్సి ఉంది. ఈ గ్రామాల పరిధిలో చెరువులు, ఇతర తాగునీటి స్కీములు మరో 50కి పైగా ఉన్నాయి. వీటన్నిటికీ కొమ్మమూరు కాలువే ఏకైక ఆధారం. ఇప్పటికే ఎగువ ప్రాంతం నుంచి సక్రమంగా నీరు చేరకపోవడంతో కాలువ పరిధిలోని శివారు ఆయకట్టుకు నీరందక పంటలు పండటం లేదు.
కాలువల్లో ఆయిల్ ఇంజిన్లు పెట్టుకుని నీటిని తోడుకుంటే తప్ప సాగునీరందని పరిస్థితి. దీంతో ఎగువ ప్రాంత రైతులతో దిగువ ప్రాంత రైతులు తరచూ గొడవలకు దిగాల్సివస్తోంది. ప్రజాప్రతినిధులు,అధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోకుండా కొమ్మమూరు కాలువపై పారిశ్రామికవేత్త సొంత ప్రయోజనం కోసం ఎత్తిపోతల పథకం నిరి్మంచాలనుకోవడంపై రైతులు మండిపడుతున్నారు.
ప్రజలకు, పొలాలకు మురికినీరు ఇస్తారట
కొమ్మమూరులో నీటిని వాడుకున్నందుకు ప్రతిగా రూ.12 కోట్లతో మరో లిఫ్డ్ ఏర్పాటు చేసి నల్లమడ డ్రైయిన్‌నుంచి మురుగునీరు ఎత్తి కొమ్మమూరులో పోస్తామని ప్రభుత్వం మెలిక పెట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లమడ డ్రెయిన్‌లోకి నరసరావుపేట, చిలుకలూరిపేట పట్టణాలు మొదలుకొని అన్నిగ్రామాల నుంచి మురుగునీరు వచ్చి చేరుతుంది.
ఆ ప్రాంతంలోని పరిశ్రమల వ్యర్థాలు సైతం నల్లమడ డ్రెయిన్‌లో కలుస్తాయి. సముద్రం నీరు ఇందులో చేరుతుంది. దీంతో ఆ నీరు విషతుల్యంగా మారి పంటలకు, తాగునీటి అవసరాలకు పనికిరాదు. నీరు పెట్టినా పంటతోపాటు భూమి పనికిరాకుండా పోతుందని రైతులు చెబుతున్నారు.
కొత్త లిఫ్ట్ పెడితే దిగువ ఆయకట్టు ఎడారే
కొమ్మమూరు కాలువపై చినకాకుమానువద్ద కొత్తగా లిఫ్ట్ పథకం ఏర్పాటు చేస్తే కాలువ దిగువనున్న లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టు ఎడారిగా మారుతుంది. ఇప్పటికే సక్రమంగా నీళ్లందక శివారు ఆయకట్టు రైతులు పంటలు ఎండబెట్టుకుంటున్నారు.
కాలువల్లో ఇంజిన్లు పెట్టి నీటిని తోడుకున్నా సక్రమంగా పంటలు పండటం లేదు. ఈ పరిస్థితిలో వ్యాపారవేత్త ప్రయోజనాల కోసం లిఫ్ట్ పెట్టి దిగువ రైతుల కడుపు కొట్టడం సరికాదు. తక్షణం ప్రభుత్వం కొత్త లిఫ్ట్ పథకాన్ని విరమించుకోవాలి. – యార్లగడ్డ సుబ్బారావు, రైతు, కారంచేడు


