
సాక్షి, న్యూఢిల్లీ: జియో ఫోన్ యూజర్లకు రిలయన్స్ జియో శుభవార్త అందించింది. ఇప్పటివరకు జియో ఫోన్లలో అందుబాటులోలేని ప్రముఖ యాప్ ఫేస్‌బుక్‌ను అందుబాటులోకి తేనుంది. ఇండియా కా స్మార్ట్‌ఫోన్‌లో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ప్రత్యేక ఫేస్‌బుక్ వెర్షన్‌ను వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రారంభించనుంది. ఫేస్‌బుక్ రేపటినుంచి (ఫిబ్రవరి 14) అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. యాప్‌స్టోర్ ద్వారా దీన్ని జియో డివైస్‌లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది.
పరివర్తనా సాంకేతికతతో, ప్రపంచంలోనే అత్యంత సరసమైన జియో ఫోన్‌ను అందించామనీ, దీంతో ఫీచర్‌ఫోన్‌నుంచి భారతీయులు స్మార్ట్‌ఫోన్లకు మైగ్రేట్ అయినట్టు జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ వెల్లడించారు. ముందు వాగ్దానం చేసినట్టుగా ఫేస్‌బుక్ సహా ఇతర ప్రముఖ యాప్‌లను అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. మరోవైపు జియోతో భాగస్వామ్యం ద్వారా లక్షలమంది యూజర్లకు ఉత్తమమైన ఫేస్‌బుక్ అనుభవాన్ని అందించడం సంతోషంగా ఉందని ఫేస్‌బుక్ వైస్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్కో వరేలా పేర్కొన్నారు. జియోఫోన్ కర్సరు ఫంక్షన్‌కు అనుగుణంగా తాజా యాప్‌ను ఆప్టిమైజ్ చేసినట్టు చెప్పారు. ఈ కొత్త ఫేస్‌బుక్ వెర్షన్‌ను ప్రత్యేకంగా జియో కాయ్ ఆపరేటింగ్ సిస్టం కోసం రూపొందించారు. వెబ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా భారతదేశంలో 50 కోట్ల మంది జియో ఫోన్ యూజర్లకు ఫేస్‌బుక్ అందుబాటులోకి వస్తుంది. దీంట్లో పుష్ నోటిఫికేషన్లు, వీడియోలు సహా బయటి సమాచారానికి సంబంధిచిన లింక్స్‌కు మద్దతు ఇస్తుంది.