
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న తెలుగు రాష్ట్రాలకు నిరాశే ఎదురైంది. విభజన హామీలు, రాజధానికి నిధుల వంటి అంశాలపై మాటమాత్రంగానైనా ప్రస్తావించకపోవడం తీవ్ర అసంతృప్తి మిగిల్చింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు చిట్టచివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో విభజన సమస్యలకు పరిష్కారంగా కేంద్రం ఈ బడ్జెట్‌లో చొరవ చూపుతుందన్న అంచనాలు గల్లంతయ్యాయి.
ఏపీ విషయానికి వస్తే రాజధాని నిర్మాణానికి నిధులు, ఆర్థిక సంఘం నిధులు, ద్రవ్యలోటును భర్తీ చేసేందుకు సాయం, పారిశ్రామిక ప్రోత్సహకాలు, రైల్వేజోన్ ప్రకటన.. ఇలా పలు హమీలపై బడ్జెట్ సాయాన్ని ఆశించగా వాటి ఊసే లేకపోవడం గమనార్హం. విభజన హమీలకు బడ్జెట్‌లో మోక్షం లభిస్తుందన్న ఆశలకూ గండిపడింది. పోలవరం ప్రాజెక్టు స్థితిగతులు.. నిర్మాణానికి నిధుల ఊతంపై బడ్జెట్‌లో భరోసా కల్పిస్తారన్న అంచనాలనూ కేంద్రం విస్మరించింది.
తెలంగాణకూ...
కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ పెట్టుకున్న ఆశలూ నెరవేరలేదు. ప్రాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎయిమ్స్ హామీలు ఆచరణకు నోచుకుంటాయన్న ఆశలు ఫలించలేదు. ఇక మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధుల కేటాయింపుపైనా చాలా కాలంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్నికోరుతూ వస్తున్నా బడ్జెట్‌లో ఆ దిశగా ఎలాంటి చర్యలూ లేకపోవడంతో నిరాశ ఎదురైంది.