కరోనా: 4 రోజుల్లో రూ.19.49 లక్షల కోట్లు ఆవిరి

Investor wealth worth Rs 19.49 lakh cr wiped out in 4 days - Sakshi

సాక్షి, ముంబై: కోవిడ్‌-19 భయాలతో దలాల్‌ స్ట్రీట్‌ గజగజ వణుకుతోంది. కరోనావైరస్ మహమ్మారి ప్రపంచ మార్కెట్లతోపాటు, దేశీయ స్టాక్‌మార్కెట్లను అతలాకుతలం చేస్తోంది. దీంతో ఈ వారంలో కూడా కీలక సూచీలు తీవ్ర  నష్టాలను మూటగట్టుకున్నాయి. వరుస నష్టాలతో లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకు పోయింది. ముఖ్యంగా  ఈ వారంలో నాలుగు రోజుల వ్యవధిలో రూ.19.49 లక్షల కోట్ల విలువైన పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. దీనికితోడు భారతదేశంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసులు, మరణాలు ఇన్వెస్టర్లలో తీవ్ర నిరాశను నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ట్రేడింగ్‌లో ఆరంభంలోనే నష్టాల బాట పట్టాయి. మిడ్‌ సెషన్‌లో కొంత పుంజుకున్నప్పటికీ, ప్రధాన మద్దతు స్థాయిలను నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందాయి. అయితే షార్ట్‌ కవరింగ్‌ ప్రభావంగానే రికవరీ వచ్చిందనీ, ఇన్వెస్టర్ల అప్రమత్తత రానున్న కాలంలో కొనసాగుతుందని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు.

వరుసగా నాలుగవ రోజు మార్కెట్లు పడిపోవడంతో, బీఎస్‌ఈ-లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.19,49,461.82 కోట్ల నుండి 1,09,76,781 కోట్లకు పడిపోయింది. నాలుగు రోజుల్లో బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్‌  5,815 పాయింట్లు కుప్పకూలింది. 1200 కు పైగా కంపెనీలు ఏడాది కనిష్ట స్థాయికి చేరుకున్నాయంటే.. నష్టాలను అంచనా వేయవచ్చు. మరోవైపు  కోవిడ్‌ -19 (కరోనా) ముప్పు దేశీయ కరెన్సీని  కూడా బాగా ప్రభావితం చేసింది. దీంతో గురువారం డాలరుమారకంలో రూపాయి చారిత్రక కనిష్టానికి పడిపోయింది. 85 పైసల నష‍్టంతో 75.11  వద్ద ఆల్‌ టైం కనిష్టానికి చేరింది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top