సెన్సెక్స్ 24 వేలకు వస్తుంది..! | Investment Guru Marc Faber | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్ 24 వేలకు వస్తుంది..!

May 22 2015 1:28 AM | Updated on Aug 24 2018 4:48 PM

సెన్సెక్స్ 24 వేలకు వస్తుంది..! - Sakshi

సెన్సెక్స్ 24 వేలకు వస్తుంది..!

భారత్ స్టాక్ మార్కెట్లు రానున్న రోజుల్లో మరింత కుదుపులకు గురయ్యే అవకాశం ఉందని...

అమెరికాలో మరోవిడత సహాయ ప్యాకేజీకి ఆస్కారం ఉంది...
ఈ ఏడాది యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల పెంపు ఉండకపోవచ్చు...
మోదీ చర్యలు బాగున్నా.. ఫలితాలు నిరాశే...
ఇన్వెస్ట్‌మెంట్ గురు మార్క్ ఫేబర్ వ్యాఖ్యలు...

న్యూఢిల్లీ: భారత్ స్టాక్ మార్కెట్లు రానున్న రోజుల్లో మరింత కుదుపులకు గురయ్యే అవకాశం ఉందని ప్రపంచ ప్రసిద్ధ ఇన్వెస్ట్‌మెంట్ గురు మార్క్ ఫేబర్ పేర్కొన్నారు.

ఇప్పటికే అధిక స్థాయిలకు చేరినందున అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్లలో ప్రధాన సూచీలు పెద్దగా రాబడులను అందించకపోవచ్చని కూడా చెప్పారు. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్ 24,000 పాయింట్ల స్థాయికి దిగజారే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ‘ద గ్లూమ్ బూమ్ అండ్ డూమ్ రిపోర్ట్’ అనే ఇన్వెస్ట్‌మెంట్ న్యూస్‌లెటర్‌కు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న ఫేబర్ తన తాజా నివేదికలో ఈ అంశాలను పేర్కొన్నారు. ‘భారత్ మార్కెట్ల పనితీరు గ్లోబల్ మార్కెట్లపైన కూడా ఆధారపడి ఉంటుంది.

సాధారణంగా 30,000 పాయింట్ల పైస్థాయి వరకూ జరిగిన భారీ ర్యాలీ తర్వాత ఇప్పుడు గరిష్టస్థాయిల నుంచి 30% మేర కరెక్షన్‌కు ఆస్కారం ఉంది. ఇప్పటికే కొన్ని స్టాక్స్ ధరలు భారీగా దిగొచ్చాయి. దీన్నిబట్టి చూస్తే 24,000 పాయింట్ల స్థాయికి తగ్గితే ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. అయితే, కొన్ని షేర్లు మంచి లాభాలను అందించగలవు. ప్రస్తుతం దీన్ని ‘స్టాక్-పికర్స్ మార్కెట్‌గా పేర్కొనవచ్చు’ అని ఫేబర్ అభిప్రాయపడ్డారు.

విదేశీ ఇన్వెస్టర్లపై మ్యాట్ విధింపు, ఇతరత్రా పరిణామాల నేపథ్యంలో ఇటీవల భారత్ స్టాక్ సూచీలు పతనబాటలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెన్సెక్స్ 27,000-28,000 మధ్యలో తీవ్ర హెచ్చుతగ్గులతో కదలాడుతోంది. ఇంకా పలు అంశాలపై ఆయన ఏమన్నారంటే...
 మోదీ పాలన: భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరణల బాట పట్టించేందుకు ప్రధాన మంత్రి మోదీ చూపుతున్న చొరవ అభినందనీయం. అయితే, దీనికి తగ్గ ఫలితం మాత్రం కనబడటం లేదు. ఇది అసంతృప్తి కలిగిస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాదిరిగా మోదీకి పూర్తి నిర్ణయాధికారం లేదు. ప్రజాస్వామ్య దేశం కావడంతో ప్రతిపక్షంతో సయోధ్య అవసరం.
 
అమెరికా వడ్డీరేట్ల పెంపు: ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచే అవకాశాలు లేవు(సెప్టెంబర్‌లో రేట్ల పెంపు మొదలు కావచ్చని భారీగా అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే). అంతేకాదు ఆర్థిక వ్యవస్థ ఇంకా మందకొడిగానే ఉంది. గత ఆర్నెల్లలో వృద్ధి తగ్గుముఖం పట్టింది. రేట్ల పెంపునకు ఇదే ప్రధాన అడ్డంకి. ఈ నేపథ్యంలో నాలుగో విడత సహాయ ప్యాకేజీ(క్యూఈ4)ని ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
 ఆర్‌బీఐ వడ్డీరేట్ల కోత: పారిశ్రామికోత్పత్తి మందగమనం చూస్తుంటే ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు కొనసాగవచ్చు. అయితే, ఈ ప్రక్రియ నిదానంగా ఉండొచ్చు.
 
గ్రీస్ సంక్షోభం: ఇప్పటికే దివాళా తీసిన గ్రీస్.. అప్పులు ఎప్పటికీ తిరిగి చెల్లించే పరిస్థితి లేదు. 300 బిలియన్ డాలర్ల రుణ భారాన్ని మోసే సామర్థ్యం గ్రీస్ ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం లేదు. మరోపక్క, యూరో జోన్ నుంచి గ్రీస్ వైదొలగడం కూడా అసంభవం. ఎందుకంటే.. ఒకవేళ గ్రీస్ వైదొలిగితే అది రాజకీయ రంగు పులుముకుంటుంది. చైనా, రష్యాలు గ్రీస్‌ను మచ్చికచేసుకునే అవకాశం ఉంది. యూరోజోన్‌తో సన్నిహిత సంబంధాలున్న అమెరికా ఇలా జరగాలని ఎన్నడూ కోరుకోదు.

Advertisement
 
Advertisement
Advertisement