ఇన్‌ఫ్రాకు రుణాలిక కష్టమే!

Infrastructure lending may take a back seat as RBI refuses to budge on new NPA rules - Sakshi

ఆర్‌బీఐ కఠిన నిబంధనలే కారణం  

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఫిబ్రవరి 12వ తేదీన విడుదల చేసిన నిబంధనావళి వల్ల దేశంలో మౌలిక రంగానికి బ్యాంకింగ్‌ రుణాలు... ప్రత్యేకించి దీర్ఘకాలిక ఫండింగ్‌ నెమ్మదిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొండిబకాయిలకు (ఎన్‌పీఏ) సంబంధించి కొత్త నిబంధనావళిని సడలించే సమస్యే లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం, పరిశ్రమలు, బ్యాంకింగ్‌ నుంచి నిబంధనల సడలింపునకు సంబంధించి వస్తున్న విజ్ఞప్తులను మన్నించలేమని కూడా ఆర్‌బీఐ స్పష్టమైన సంకేతాలిచ్చింది.

ఎగవేతదారుల సత్వర గుర్తింపు, రుణ పునఃచెల్లింపుల్లో విఫలమైన కంపెనీలను (ఒక రోజు ఆలస్యం అయినా) దారిలో పెట్టడానికి అనుసరించాల్సిన సత్వర ప్రణాళిక రూపకల్పన విధివిధానాలు, ఆయా కంపెనీలను నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)కు రిఫర్‌ చేయడానికి 180 రోజుల కాలపరిమితుల విధింపు వంటి అంశాలు ఆర్‌బీఐ తాజా నిబంధనావళిలో ఉన్నాయి.

ఈ కఠిన నిర్ణయాల నేపథ్యంలో విద్యుత్, రోడ్లు, నౌకాశ్రయాలకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో దీర్ఘకాలిక ఫండింగ్‌ తగ్గే అవకాశం ఉందని తాము భావిస్తున్నట్లు ఒక బ్యాంకర్‌ తెలిపారు. నిజానికి దేశాభివృద్ధికి ఈ రంగాలకు రుణ లభ్యత అవసరమైనా, ఇలాంటి రుణాలను రాబట్టుకునే విషయంలో ఇబ్బంది సైతం తీవ్రంగా ఉందని పేర్కొన్న మరో బ్యాంకర్‌ అందువల్ల ఆయా రంగాలకు రుణ మంజూరులో బ్యాంకులు ఆచితూచి వ్యవహరిస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top