పరిశ్రమలు రయ్‌..రయ్‌ | Sakshi
Sakshi News home page

పరిశ్రమలు రయ్‌..రయ్‌

Published Tue, Feb 13 2018 1:52 AM

India's inflation in January eases to 5.07%, IIP for December at 7.1% - Sakshi

న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ), రిటైల్‌ ద్రవ్యోల్బణం అంశాలకు సంబంధించి సోమవారంనాడు విడుదలైన తాజా గణాంకాలు కొంత ఊరటనిచ్చాయి. తయారీ రంగం ఊతంతో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి 2017 డిసెంబర్‌లో 7.1 శాతంగా ఉంది. 2016 డిసెంబర్‌లో ఈ రేటు 2.4 శాతం. అయితే నవంబర్‌ 2017తో (8.8 శాతం) పోల్చితే మాత్రం ఐఐపీ తక్కువగా నమోదయ్యింది. డిసెంబర్‌తో పోల్చితే జనవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది.  కేంద్ర గణాంకాల కార్యాలయం సోమవారంనాడు విడుదల చేసిన గణాంకాలు చూస్తే...

పారిశ్రామిక ఉత్పత్తిలో ముఖ్యాంశాలు...
తయారీ: మొత్తం సూచీలో 74 శాతంగా ఉన్న ఈ విభాగంలో డిసెంబర్‌లో వృద్ధి 0.6 శాతం నుంచి భారీగా 8.4 శాతానికి పెరిగింది. ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్య రేటు మాత్రం 5 శాతం నుంచి 3.8 శాతానికి తగ్గింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 16 సానుకూల ఫలితాన్ని నమోదుచేసుకున్నాయి.  
   మైనింగ్‌: వృద్ధి రేటు డిసెంబర్‌లో 10.8 శాతం నుంచి తీవ్రంగా 1.2 శాతానికి పడిపోయింది. ఆర్థిక సంవత్సరం ఏడు నెలల కాలంలో ఈ రేటు 4.3 శాతం నుంచి 2.8 శాతానికి తగ్గింది.  
    విద్యుత్‌: డిసెంబర్‌లో వృద్ధి రేటు 6.4 శాతం నుంచి 4.4 శాతానికి తగ్గగా, ఏడు నెలల కాలంలో ఈ రేటు 6.3 శాతం నుంచి 5.1 శాతానికి పడింది.
    క్యాపిటల్‌ గూడ్స్‌: పెట్టుబడులకు ప్రతిబింబంగా పరిగణించే ఈ విభాగంలో డిసెంబర్‌లో వృద్ధి రేటు 6.4 శాతం నుంచి 16.4 శాతానికి ఎగసింది.  
   అన్ని విభాగాలూ కలిసి... రేటు 2.4 శాతం నుంచి 7.1 శాతానికి పెరిగింది. అయితే ఆర్థిక సంవత్స రం ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్య నెలల్లో ఈ రేటు 5.1 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గింది.


రిటైల్‌ ధరలు కాస్త తగ్గాయి
2018 జనవరిలో టోకు ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.07 శాతంగా ఉంది. 2017 డిసెంబర్‌లో ఈ రేటు 17 నెలల గరిష్ట స్థాయిలో 5.21 శాతం. అయితే 2017 జనవరిలో మాత్రం రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.17 శాతంగా నమోదయ్యింది. అంటే నెలవారీలో తగ్గినా వార్షికంగా చూస్తే రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరిగిందన్నమాట.

విభాగాలవారీగా...
జనవరిలో ఐదు ప్రధాన విభాగాల్లో ద్రవ్యోల్బ ణాన్ని చూస్తే...ఆహారం, పానీయాల ద్రవ్యోల్బణం 4.58 శాతం, పాన్, పొగాకు, ఇతర హానికారక ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 7.58 శాతం, దుస్తులు పాదరక్షల విభాగంలో ధరలు 4.94 శాతం, హౌసింగ్‌ విషయంలో 8.33 శాతం, ఫ్యూయెల్‌ అండ్‌ లైట్‌కు సంబంధించి 7.73 శాతం ధరలు పెరిగాయి.

ఆహారం, పానీయాల విషయంలో ప్రధానంగా పప్పు దినుసులు (20.19 శాతం క్షీణత) మినహా మిగిలిన అన్ని  ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగాయి. కూరగాయల ధరలు భారీగా 26.97 శాతం ఎగశాయి. గుడ్ల ధరలు 8.70 శాతం పెరిగాయి. పండ్ల ధరలు 6.24 శాతం పెరగ్గా, మాంసం చేపల ధరలు 4.34 శాతం, పాలు, పాల పదార్థాల ధరలు 4.21 శాతం ఎగశాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement