2022 నాటికి 5జీ సేవలు

India to get 5G services by 2022 - Sakshi

2023లో 78% 4జీ వోల్టే ఫోన్లే!

స్మార్ట్‌ఫోన్ల సంఖ్య 97 కోట్లకు

ఎరిక్సన్‌ మొబిలిటీ నివేదిక అంచనా

న్యూఢిల్లీ: దేశంలో తదుపరి తరం టెలికం సేవలైన 5జీ ఆధారిత సర్వీసులు 2022 నాటికి అందుబాటులోకి వస్తాయని ఎరిక్సన్‌ మొబిలిటీ అంచనా వేసింది. ఇక 4జీ సర్వీసులను వాడే వారి సంఖ్య 2023 చివరి నాటికి 78 శాతానికి పెరుగుతుందని... అదే సమయంలో 5జీ చందాదారులు కోటికి చేరతారని ఈ సంస్థ ఓ నివేదికలో తెలియజేసింది. 2018 చివరి నాటికి వాణిజ్య పరంగా 5జీ సేవలు ఆరంభం కావచ్చని ఎరిక్సన్‌ మొబిలిటీ రిపోర్ట్‌ (ఈఎంఆర్‌) ఎడిటర్‌ ప్యాట్రిక్‌ సెర్వాల్‌ తెలిపారు. 

‘‘2017 ముగిసే నాటికి 4జీ ఎల్‌టీఈ చందాదారుల వాటా 20 శాతం. భారత్‌లో అత్యాధునిక టెక్నాలజీల వైపు మళ్లటమనేది కొనసాగుతుంది. 2023 నాటికి మొత్తం మొబైల్‌ చందాదారుల్లో 78 శాతం (78 కోట్ల కనెక్షన్లు) ఎల్‌టీఈవే ఉంటాయి’’ అని ఈ నివేదిక పేర్కొంది. ఇక 2023 చివరి నాటికి అంతర్జాతీయంగా 4జీ కనెక్షన్లు 550 కోట్లుగా ఉంటాయని అంచనా వేసింది.

అంతర్జాతీయంగా రెండో స్థానం
అంతర్జాతీయంగా సంఖ్యా పరంగా మొబైల్‌ చందాదారుల వృద్ధిలో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. 2018 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) నికరంగా 1.6 కోట్ల చందాదారులు పెరగడంతో మొత్తం చందాదారుల సంఖ్య 118 కోట్లకు చేరారు. మొబైల్‌ చందాదారుల వృద్ధిలో చైనా మొదటి స్థానంలో ఉంది. జవనరి–మార్చి కాలంలో 5.3 కోట్ల కనెక్షన్లు పెరిగాయి. దీంతో చైనాలో మొబైల్‌ చందాదారుల సంఖ్య 147 కోట్లకు చేరింది.

భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల వినియోగం 2023 నాటికి 97 కోట్లకు చేరుతుందని, 2017 చివరి నాటికి ఈ సంఖ్య 38 కోట్లేనని ఈ నివేదిక తెలియజేసింది. 5జీ స్మార్ట్‌ఫోన్లు 2019 తొలి అర్ధభాగంలో రావడం ప్రారంభమవుతుందని సెర్వాల్‌ పేర్కొన్నారు. ఇక స్మార్ట్‌ఫోన్ల వినియోగం వృద్ధితో భారత్‌లో నెలవారీ మొబైల్‌ డేటా ట్రాఫిక్‌ 2017చివరి నాటికి ఉన్న 1.9ఈబీ (ఎక్సాబైట్‌) నుంచి 10ఈబీ స్థాయికి పెరుగుతుందని అంచనా వేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top