అంబానీ కుటుంబానికి ఐటీ నోటీసులు?!

Income Tax notices to Reliance chairman Mukesh Ambani wife Nita Ambani 3 children - Sakshi

సాక్షి, ముంబై: ఆదాయపు పన్ను శాఖ రిలయన్స్ చైర్మన్ ముకేశ్‌ అంబానీకు  షాకిచ్చినిట్టు తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం అంబానీ భార్య నీతా అంబానీ, వారి సంతానం అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీలకు నోటీసులిచ్చింది. బ్లాక్‌మనీ యాక్ట్ 2015 కింద ఈ నోటీసులు ఇచ్చినట్లు నివేదికలు తెలిపాయి. అనేక దేశాల నుండి వచ్చిన సమాచారంపై దర్యాప్తు జరిపిన తరువాత ఆదాయపు పన్ను శాఖ వీరికి నోటీసులు పంపింది. అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, నీతా అంబానీలు అనేక దేశాల్లో విదేశీ ఆదాయాన్ని, ఆస్తులను వెల్లడించలేదని సమాచారం.  2019, మార్చి 28న ఆదాయ పన్ను శాఖ ఈ నోటీసులు  జారీ చేసింది. 

వ్యాపారవేత్తలపై దర్యాప్తు ప్రారంభించిన తరువాత 2011 లో, హెచ్‌ఎస్‌బీసీ జెనీవాలో 700 మంది భారతీయులకు ఖాతాలున్న వివరాలు భారత ప్రభుత్వానికి లభించాయి. 2015 లో, స్విస్ లీక్స్ గా పిలిచే ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసిఐజె) హెచ్‌ఎస్‌బీసీ జెనీవా ఖాతాదారుల సంఖ్య 1,195 అని పేర్కొంది. 601 మిలియన్ డాలర్ల బ్యాలెన్స్‌తో 14 హెచ్‌ఎస్‌బిసి జెనీవా బ్యాంక్ ఖాతాల క్లస్టర్‌ను ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ నివేదించింది. ఇవన్నీ అనేక మధ్యవర్తుల ద్వారా రిలయన్స్ గ్రూపుతో అనుసంధానించ బడ్డాయని తెలిపింది.  ఈ 14 కంపెనీలలో ఒకదానిలో "అంతిమ లబ్ధిదారులు" గా అంబానీ కుటుంబం పేర్లు ఉన్నాయనీ,  వివిధ విదేశీ, దేశీయ సంస్థల ద్వారా ఈ సంస్థలలో భారీ మొత్తాన్ని ఎలా అనుసంధానించబడి, ఎలా పెట్టుబడి పెట్టారో ఐటి నివేదిక వెల్లడించినట్టు పేర్కొంది. ముంబైలోని అదనపు ఆదాయ కమిషనర్‌ ద్వారా బ్లాక్ మనీ (అప్రకటిత విదేశీ ఆస్తులు, ఆదాయం)  టాక్స్ యాక్ట్ 2015, సెక్షన్ 10 లోని సబ్ సెక్షన్ (ఐ) ప్రకారం ఈ నోటీసులు లిచ్చినట్టు నివేదిక పేర్కొంది.

ఖండించిన రిలయన్స్‌
మరోవైపు ఈ ఆరోపణలపై స్పందించిన రిలయన్స్ ప్రతినిధి ఈ నివేదికలను పూర్తిగా ఖండించారు. అలాగే ఐటీ శాఖ నోటీసులేవీ తమకు అందలేదని పేర్కొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top