ఎన్‌పీఏలను నేరంగా చూస్తున్నారు

ఎన్‌పీఏలను నేరంగా చూస్తున్నారు


ఇవి పోగయ్యేది వైఫల్యాల వల్లే

వైఫల్యాలు జరుగుతుంటాయి..

ఎస్‌బీఐ చీఫ్‌ అరుంధతీ భట్టాచార్య




కోల్‌కతా: దేశీ బ్యాంకింగ్‌ రంగంలో మొండి బకాయిలు రూ.8 లక్షల కోట్లకు చేరిన తరుణంలో, ఎగవేతదారులపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆర్‌బీఐ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ చైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మన దేశంలో మొండి బకాయిలను (ఎన్‌పీఏ) నేరంగా పరిగణిస్తున్నారు. కానీ, వీటిని అలా చూడకూడదు. ఎన్‌పీఏలు తయారయ్యేది వైఫల్యాల వల్లే. వైఫల్యాలకు అనుమతి ఉండదు.



ఇందుకు సమాజం కూడా అంగీకరించదు. అయినా సరే వైఫల్యాలు చోటు చేసుకుంటాయి’’ అని అరుంధతి  మంగళవారం కోల్‌కతాలో చెప్పారు. ఇక్కడ ఫిక్కీ సమావేశంలో మాట్లాడుతూ... ‘‘జీడీపీ 8.5% వృద్ధి చెందుతున్న సమయంలో ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారతాయని ఊహించలేదు. కానీ, జీడీపీ వృద్ధి 4%కి పడిపోవడంతో బ్యాంకింగ్‌ రంగంలో ఎన్‌పీఏలు భారీగా పెరిగిపోయాయి. అయితే మొత్తం రుణాల్లో ఇవి 5 శాతమేనని గుర్తుంచుకోవాలి’’ అని ఆమె చెప్పారు.



మరిన్ని రిటైల్‌ ఉత్పత్తులు...

డిజిటల్‌ వేదికగా మరిన్ని రిటైల్‌ ఉత్పత్తులను తీసుకురానున్నట్టు అరుంధతీ భట్టాచార్య వెల్లడించారు. ప్రస్తుతం డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ... వినియోగదారులు ఖర్చు చేసే తీరును డిజిటల్‌ సాయంతో విశ్లేషించనున్నట్టు చెప్పారు. రుణ వృద్ధి 9% ఉంటే సరైనదని, కానీ అది 7% కంటే తక్కువే ఉందని చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top