ఈ సేల్స్.. సూపర్ !

Hyderabad Sixth Place in Online Shoppings in Assocham Survey - Sakshi

ఆన్‌లైన్‌ కొనుగోళ్లు అదుర్స్‌

90 శాతం యువత మొగ్గు 

దేశంలోనే ఆరోస్థానంలో గ్రేటర్‌   

78 శాతం మేర మొబైల్స్, గాడ్జెట్ల విక్రయాలే.. 

అసోచామ్‌ తాజా సర్వేలో వెల్లడి

మెట్రో నగరాల ర్యాంకులిలా..  దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా,  అహ్మదాబాద్, పుణె, గుర్గావ్, నోయిడా, చండీగఢ్, నాగపూర్, ఇండోర్, కోయంబత్తూర్, విశాఖపట్నం నగరాలపై ఈ సర్వే చేశారు. ఆయా మెట్రో నగరాల్లోనూ ఏటా 60 నుంచి 65 శాతం మేర ఆన్‌లైన్‌ కొనుగోళ్లు పెరుగుతున్నాయని పేర్కొంది.

సాక్షి, సిటీబ్యూరో: మెట్రో నగరాల్లో ఆన్‌లైన్‌ కొనుగోళ్లు అదరగొడుతున్నాయి. నచ్చిన వస్తువును ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడంలో మెట్రో సిటీజన్లు ముందు వరుసలో నిలుస్తున్నారు. ఈ విషయంలో గ్రేటర్‌ సిటీజన్లు ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఆరోస్థానంలో నిలిచారు. స్మార్ట్‌ జనరేషన్‌గా మారుతున్న కుర్రకారు ఈ విషయంలో అగ్రభాగాన నిలవడం విశేషం. ప్రధానంగా 18– 35 ఏళ్ల మధ్యనున్న యువతరంలో సుమారు 90 శాతం ఆన్‌లైన్‌ కొనుగోళ్ల వైపే మొగ్గు చూపుతున్నట్లు అసోచామ్‌ తాజా సర్వేలో వెల్లడైంది.

ఇక స్మార్ట్‌ఫోన్‌ వినియోగంతో ఆన్‌లైన్‌లో వస్తువులు కొనేవారి సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోందని అసోచామ్‌ పేర్కొంది. ఆన్‌లైన్‌ మాధ్యమం ద్వారా పలువురు నెటిజన్ల అభిప్రాయాలను సేకరించి ఈ సర్వే ఫలితాలను వెల్లడించారు. ఇక దేశవ్యాప్తంగా రెండు నెలలుగా సుమారు 15 మెట్రో నగరాల్లో ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ డీల్స్‌ సుమారు రూ.30 వేల కోట్ల మేర జరిగినట్లు అంచనా వేయడం విశేషం. ఆన్‌లైన్‌ కొనుగోళ్లు పెరగడానికి అందరికీ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడమే కారణమని అసోచామ్‌ పేర్కొంది. దేశంలో పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్‌ వినియోగం ఈ కామర్స్‌ ఇండస్ట్రీకి ఊతమిచ్చిందని సర్వేలో పేర్కొంది.   

ఏంకొంటున్నారంటే..
మొబైల్స్, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, దుస్తులు, బ్రాండెడ్‌ షూస్, ఆభరణాలు, పర్‌ఫ్యూమ్స్, గృహోపకరణాలు తదితరాల కొనుగోలుకు నెట్‌జన్లు ఆసక్తి చూపుతున్నారని తెలిసింది. వీటిలోనూ ప్రధానంగా మొబైల్స్, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లను 78 శాతం మేర కొనుగోలు చేస్తున్నట్లు సర్వేలో తేలింది. పండగ ఆఫర్స్, నిర్ణీత సమయాల్లో బుక్‌చేస్తే భారీ తగ్గింపు ధరలు, వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్లు, ధమాకా సేల్స్‌తో సుమారు 20 ఈ– కామర్స్‌ సంస్థల సైట్‌లకు వ్యాపార డీల్స్‌ పంట పండినట్లు పేర్కొంది.   

పురుషులే అధికం..  
ఆన్‌లైన్‌ కొనుగోళ్లలో పురుషులదే ఆధిపత్యమని వెల్లడైంది. వీరి వాటా 65 శాతం ఉండగా.. మహిళలు 35 శాతం మంది ఉన్నారు.  పండగల సీజన్‌లో 18– 35 ఏళ్ల మధ్య మహిళలు, పురుషులే అధిక భాగం ఆన్‌లైన్‌ కొనుగోళ్లు జరుపుతున్నట్లు తేలింది.  

వయసుల వారీగాకొనుగోళ్లు ఇలా.. 
నిత్యం ఆన్‌లైన్‌లో జరిగే కొనుగోళ్లలో యువతరమే అగ్రస్థానంలో నిలిచారు. 18– 35 వయసు గలవారు అత్యధికంగా 90 శాతం మంది ఈ కొనుగోళ్లలో భాగస్వామ్యులవుతున్నారట. ఇక 36–45 ఏళ్ల వారు 8 శాతం, 45– 60 ఏళ్లున్నవారు కేవలం రెండు శాతం మాత్రమే ఆన్‌లైన్‌లో కొనుగోళ్లుజరుపుతున్నారట. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top