హెరిటేజ్ ఫుడ్స్ చేతికి రిలయన్స్ డెయిరీ వ్యాపారం

హెరిటేజ్ ఫుడ్స్ చేతికి రిలయన్స్ డెయిరీ వ్యాపారం


డీల్ విలువ వెల్లడించని సంస్థ

దేశవ్యాప్త విస్తరణకు అవకాశం


 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : డెయిరీ, రిటైల్ రంగ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ తాజాగా రిలయన్స్ రిటైల్‌కి (ఆర్‌ఆర్‌ఎల్) చెందిన డెయిరీ వ్యాపార విభాగాన్ని కొనుగోలు చేస్తోంది. డీల్ ఖరారయినా... డీల్ విలువ ఎంతన్నది మాత్రం వెల్లడి కాలేదు. నియంత్రణ సంస్థల అనుమతులు, ఇతరత్రా అంశాలకు లోబడి ప్రతిపాదిత లావాదేవీ ఉంటుందని హెరిటేజ్ ఫుడ్స్ శుక్రవారం ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. రిలయన్స్ డెయిరీ విభాగం 2007 నుంచి దేశవ్యాప్తంగా పాల సేకరణ, ప్రాసెసింగ్, పంపిణీ కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రధానంగా డెయిరీ లైఫ్, డెయిరీ ప్యూర్ బ్రాండ్స్ కింద ప్యాక్డ్ మిల్క్, ఫ్లేవర్డ్ మిల్క్, డెయిరీ వైట్‌నర్, నెయ్యి, వెన్న, స్వీట్స్ తదితర  ఉత్పత్తులు విక్రయిస్తోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 553 కోట్ల ఆదాయం నమోదు చేసింది. ప్రస్తుతం పది రాష్ట్రాల్లోని 2,400 గ్రామాల రైతుల నుంచి రోజుకు 2.25 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది.


 హైదరాబాద్, ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్ వంటి కీలక మార్కెట్లతో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో కొత్తగా కార్యకలాపాలు విస్తరించేందుకు ఈ డీల్ తోడ్పడుతుందని హెరిటేజ్  ఆశాభావం వ్యక్తంచేసింది. డీల్ అనంతరం కూడా హెరిటేజ్ డెయిరీ ఉత్పత్తులు సహా.. ఇతరత్రా డెయిరీ ఉత్పత్తులను కూడా తమ రిటైల్, హోల్‌సేల్ స్టోర్స్ ద్వారా విక్రయించడం కొనసాగిస్తామని తెలియజేసింది. 1992లో ప్రారంభమైన హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్తుతం డెయిరీ, రిటైల్, అగ్రి, బేకరీ తదితర ఆరు వ్యాపార విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో 1,13,500 రిటైల్ అవుట్‌లెట్స్ ద్వారా ఉత్పత్తులు విక్రయిస్తోంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో 123 హెరిటేజ్ ఫ్రెష్ రిటైల్ స్టోర్స్ ఉన్నాయి. హెరిటేజ్ రిటైల్ వ్యాపార విభాగాన్ని ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు చేస్తున్నట్లు వచ్చిన వార్తలను హెరిటేజ్ ధ్రువీకరించటం తెలిసిందే.


హెరిటేజ్ లాభం రూ. 16 కోట్లు..

ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో హెరిటేజ్ ఫుడ్స్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.641 కోట్ల ఆదాయంపై సుమారు రూ.15.69 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ2లో ఆదాయం రూ.587 కోట్లు కాగా లాభం రూ.15.29 కోట్లు. అయితే స్టాండెఅలోన్ ప్రాతిపదికన ఈ ఏడాది  క్యూ2లో డెయిరీ విభాగం రూ.462 కోట్ల ఆదాయంపై రూ.30 కోట్ల లాభం నమోదు చేసింది. రిటైల్ విభాగం మాత్రం నష్టాల్లోనే ఉంది. ఈ విభాగం రూ.175 కోట్ల అమ్మకాలపై రూ.6 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top