హైదరాబాద్‌లో 'హెలీ' ట్యాక్సీ

Heli taxi in Hyderabad - Sakshi

 సీప్లేన్‌ సర్వీసులు సైతం

 ఆసక్తి కనబరుస్తున్న పవన్‌ హన్స్‌

సంస్థ సీఎండీ బి.పి.శర్మ వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భాగ్యనగరిలో హెలీ ట్యాక్సీ సర్వీసులు సాకారం కానున్నాయి. భారత్‌లో హెలికాప్టర్‌ సర్వీసులందిస్తున్న ప్రభుత్వ రంగ దిగ్గజం పవన్‌ హన్స్‌ ఈ సేవల్ని ప్రారంభించనుంది. తొలుత హైదరాబాద్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి హెలీ ట్యాక్సీ నడుపుతారు. డిమాండ్‌ ఉంటే నగరంలోనే ప్రధాన ప్రాంతాల మధ్య కూడా ట్యాక్సీ సర్వీసులు అందించేందుకు పవన్‌ హన్స్‌ సిద్ధంగా ఉన్నట్లు సంస్థ సీఎండీ బి.పి.శర్మ వెల్లడించారు. ఇక్కడ ప్రారంభమైన ఏవియేషన్‌ సదస్సులో ఆయన మీడియాతో మాట్లాడారు. హెలీ ట్యాక్సీ కోసం స్థానిక ప్రభుత్వ సంస్థ నుంచి ప్రతిపాదన వచ్చిందని చెబుతూ... హెలిపోర్టులను మాత్రం ప్రభుత్వమే ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.

దక్షిణాదిలో అడుగుపెడతాం..
పవన్‌ హన్స్‌ ప్రస్తుతం ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో 42 హెలికాప్టర్లతో సేవలందిస్తోంది. దక్షిణాదిన అడుగుపెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని శర్మ వెల్లడించారు. ‘భారత్‌లో సీప్లేన్‌ సేవలు ప్రారంభించేందుకు ప్రణాళికలు రెడీ చేశాం. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రోత్సహిస్తోంది. నీళ్లపైనా, భూమి మీద కూడా దిగేందుకు సీప్లేన్స్‌ అనువైనవి. దేశవ్యాప్తంగా ఎన్నో సరస్సులున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌పైనా దృష్టిపెట్టాం. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ అనువుగా ఉంటే ఈ సర్వీసులు ప్రారంభిస్తాం. హెలీ ట్యాక్సీ కింద టికెట్‌ ధర కనీసం రూ.2,500 ఉండొచ్చు’ అని వివరించారు. కంపెనీ త్వరలో ఢిల్లీ–ఆగ్రా మార్గంలో హెలీ రెస్క్యూ సేవలు అందించనుంది.

100 హెలికాప్టర్లు సమకూర్చుకుంటాం..
హెలికాప్టర్ల సర్వీసులకు దేశంలో మంచి డిమాండ్‌ ఉందని శర్మ చెప్పారు. ‘2025 నాటికి మొత్తం 100 హెలికాప్టర్లు సమకూర్చుకుంటాం. కొత్త హెలికాప్టర్లు, సీప్లేన్స్‌ కొనుగోలుకు, పాతవి ఆధునీకరణ, విస్తరణకు వచ్చే 10 ఏళ్లలో రూ.4,000 కోట్లు వెచ్చించాలని నిర్ణయించాం. 21 రాష్ట్రాల్లో పవన్‌ హన్స్‌ విస్తరించింది. ఉడాన్‌ రెండో దశలో 111 రూట్లను దక్కించుకున్నాం. తద్వారా కొత్తగా 22 ప్రాంతాల్లో అడుగు పెడతాం. విస్తరణకు కావాల్సిన నిధుల కోసం వ్యూహాత్మక భాగస్వామి వేటలో ఉన్నాం. వాటా విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని సంస్థ ఆధునీకరణకు వెచ్చిస్తాం’ అని వివరించారు. 

భారత్‌కు 2,100 విమానాలు
ఇదీ... వచ్చే 20 ఏళ్లలో డిమాండ్‌: బోయింగ్‌
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రానున్న 20 ఏళ్లలో భారత్‌లో కొత్తగా 2,100 విమానాలు అడుగుపెడతాయని బోయింగ్‌ అంచనా వేస్తోంది. వీటిలో చిన్నపాటి ఎయిర్‌క్రాఫ్ట్‌లు 85 శాతం ఉంటాయని బోయింగ్‌ కమర్షియల్‌ ఎయిర్‌ప్లేన్స్‌ ఆసియా పసిఫిక్, భారత్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ దినేశ్‌ కేశ్కర్‌ చెప్పారు. ‘భారత్‌లో విమాన ప్రయాణికుల సంఖ్య 2017లో 20 శాతం వృద్ధితో 11.67 కోట్లుంది. ప్రపంచ సగటు వృద్ధి 7.3 శాతమే. దీనిని బట్టి భారత మార్కెట్‌ ఏ స్థాయిలో ఉందో గమనించవచ్చు. అయిదేళ్లుగా ఇక్కడ ప్యాసింజర్‌ ట్రాఫిక్‌ గణనీయ వృద్ధిని నమోదు చేస్తోంది. 2018లో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 13.5 కోట్లను దాటుతుంది. భారత మార్కెట్‌ వృద్ధి విషయంలో ఇప్పటి వరకు బోయింగ్‌ అంచనాలు ఎప్పుడూ తప్పు కాలేదు. అంచనాలను మించి ఇక్కడ కొత్త విమానాలు అడుగుపెట్టాయి’ అని వెల్లడించారు. 
లో కాస్ట్‌ క్యారియర్లదే..: భారత్‌లో లో కాస్ట్‌ క్యారియర్లదే హవా అని బోయింగ్‌ అభిప్రాయపడింది.

‘నలుగురు ప్రయాణికుల్లో ముగ్గురు లో కాస్ట్‌ విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడున్న ఫ్లయిట్స్‌లో 60% లో కాస్ట్‌ క్యారియర్లే. 2037 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుంది. ప్రభుత్వ విధానాల సరళీకరణ, మధ్య తరగతి కుటుంబాలు పెరుగుతుండటంతో విమానయాన రంగం వృద్ధి బాటలో ఉంది. అయితే ఇందుకు తగ్గట్టుగా మౌలిక వసతులకు ప్రభుత్వం నిధులు వెచ్చించాలి. 2016 ప్రారంభం నుంచి ఇంధన ధరలు 81% పెరిగాయి. తక్కువ టికెట్‌ ధరలు, విమానాలు ఎక్కువ ప్రయాణికులతో నడవడం వంటి కారణాలతో కంపెనీలు లాభాలను ఆర్జించగలుగుతున్నాయి’ అని దినేశ్‌ వెల్లడించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top