జీఎస్టీతో లక్ష ఉద్యోగాలు | GST: Job market eyes GST booster for over 1 lakh immediate openings | Sakshi
Sakshi News home page

జీఎస్టీతో లక్ష ఉద్యోగాలు

Jun 26 2017 1:50 AM | Updated on Sep 5 2017 2:27 PM

జీఎస్టీతో లక్ష ఉద్యోగాలు

జీఎస్టీతో లక్ష ఉద్యోగాలు

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నిరుద్యోగులకు మంచి రోజులను తీసుకురానుంది! కొత్త పన్ను వ్యవస్థ కారణంగా సత్వరమే నూతనంగా లక్షకుపైగా ఉద్యోగాలు

పరిశ్రమ వర్గాల అంచనా
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నిరుద్యోగులకు మంచి రోజులను తీసుకురానుంది! కొత్త పన్ను వ్యవస్థ కారణంగా సత్వరమే నూతనంగా లక్షకుపైగా ఉద్యోగాలు ఏర్పడతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటిలో ట్యాక్సేషన్, అకౌంటింగ్, డేటా విశ్లేషణకు సంబంధించి కూడా ఉండనున్నాయి. జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. ఇది ఉద్యోగ మార్కెట్‌ వార్షికంగా 10–13 శాతం స్థాయిలో వృద్ధి చెందేందుకు తోడ్పడుతుందని, ఆర్థిక రంగంలోని పలు విభాగాల్లో నిపుణులకు డిమాండ్‌ పెంచుతుందని ఇండియన్‌ స్టాఫింగ్‌ ఫెడరేషన్‌(ఐఎస్‌ఎఫ్‌) పేర్కొంది. ‘‘జీఎస్టీతో వస్తు సేకరణ, పంపిణీ మరింత వేగవంతమవుతుంది. దీంతో లాభాలు కూడా పెరుగుతాయి.

 వీటికితోడు నిబంధనల పారదర్శకతతో అవ్యవస్థీకృత రంగంలోని వారు సైతం వ్యవస్థీకృత మార్కెట్‌ దిశగా అడుగులు వేయక తప్పదు’’ అని ఐఎస్‌ఎఫ్‌ ప్రెసిడెంట్‌ రితూపర్ణ చక్రవర్తి అన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన మొదటి త్రైమాసికం నుంచే లక్షకుపైగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని గ్లోబల్‌హంట్‌ ఎండీ సునీల్‌ గోయెల్‌ తెలిపారు. ఆ తర్వాత మరో 60,000 వరకు ఏర్పడతాయన్నారు. కంపెనీలు కొన్ని రకాల కార్యకలాపాలను అవుట్‌సోర్స్‌ చేసేందుకు మొగ్గుచూపుతాయన్నారు.

 జీఎస్టీ నిర్వహణ, సమన్వయం కోసం వ్యాపార సంస్థలు నిపుణులను నియమించుకోవాల్సి వస్తుందని, ఇది భారీ అవకాశాలను సృష్టిస్తుందని చెప్పారు. ‘‘కొత్త వ్యవస్థతో వ్యాపార సులభత్వం పెరుగుతుంది. ఇది విదేశీ ఇన్వెస్టర్లకు, కంపెనీలకు సానుకూలం. దీంతో ఉద్యోగ సృష్టికి వీలు కలుగుతుంది’’అని మాన్‌స్టర్‌ డాట్‌ కామ్‌ మిడిల్‌ఈస్ట్‌ ప్రాంత ఎండీ సంజయ్‌ మోదీ తెలిపారు. జీఎస్టీ తక్షణమే ప్రభావం చూపే రంగాల్లో ఆటోమొబైల్స్, లాజిస్టిక్స్, హోమ్‌డెకార్, ఈకామర్స్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, సిమెంట్, ఐటీ, ఐటీ ఆధారిత రంగాలు, బీఎఫ్‌ఎస్‌ఐ, కన్జ్యూమర్‌ డ్యురబుల్స్, ఫార్మా, టెలికం ఉంటాయని నిపుణుల విశ్లేషణ.

ఎఫ్‌ఎంసీజీ సరుకులు వెనక్కి: జీఎస్టీకి ముందే డీలర్లు సరుకుల నిల్వలను కుదించుకుంటున్న నేపథ్యంలో ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు అందుకు సిద్ధమయ్యాయి. సరుకులను తిరిగి వెనక్కి పంపడం, కొత్త పన్ను వ్యవస్థకు మారడం వంటివి రెండో త్రైమాసికం నాటికి సర్దుకుంటాయని భావిస్తున్నాయి. విక్రయాల స్థాయిలో నష్టాలు తగ్గించుకునేందుకు, కొత్త పన్ను వ్యవస్థకు సులభంగా మారేందుకు వీలుగా వ్యాపారులు సరుకుల నిల్వలు తగ్గించుకునే విషయంలో వారికి సహకరిస్తున్నట్టు డాబర్, మారికో, గోద్రేజ్‌ కన్జ్యూమర్‌ తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement