
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018–19) ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు రూ.20000 కోట్ల జీఎస్టీ ఎగవేతను అధికారులు గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో రూ. 10,000 కోట్ల మేర రికవరీ చేసినట్టు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సభ్యుడు జాన్‌జోసెఫ్ తెలిపారు. మోసాల నివారణకు, నిబంధనలు పాటించేలా చేసేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కేవలం 5–10% మంది పరిశ్రమకు చెడ్డపేరు తెస్తున్నారని పేర్కొన్నారు.
జీఎస్టీ రేట్ల తగ్గింపు అనంతరం మార్పునకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కోసం రియల్ ఎస్టేట్ ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లకు 5%కి, అందుబాటు ధరల ఇళ్లకు ఒక శాతానికి జీఎస్టీని తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ ఈ వారంలోనే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ తగ్గింపును పరిశ్రమ అమల్లో పెట్టి వినియోగదారులకు ప్రయోజనాన్ని బదిలీ చేయాల్సి ఉంటుంది. తగ్గింపునకు ముందు జీఎస్టీ రేట్లు 12%, 8% చొప్పున ఉన్నాయి.