రూపాయి మద్దతు.. మార్కెట్‌కు ఊతం! | Govt Announces Measures To Stabilise Rupee | Sakshi
Sakshi News home page

రూపాయి మద్దతు.. మార్కెట్‌కు ఊతం!

Sep 17 2018 12:53 AM | Updated on Sep 17 2018 12:53 AM

Govt Announces Measures To Stabilise Rupee - Sakshi

జారుడు బల్లపై ప్రయాణం చేస్తున్న రూపాయి దిశను మార్చే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గత శుక్రవారం ప్రకటించిన పలు అంశాల ప్రభావం సోమవారం మార్కెట్‌ కదలికలలో స్పష్టంగా కనిపించనుందని మార్కెట్‌ పండితులు భావిస్తున్నారు. కరెంట్‌ ఖాతా లోటు అదుపులో ఉంచడం, విదేశీ నిధుల ప్రవాహం గణనీయంగా పెరిగేలా చూడటంలో భాగంగా ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించిన అంశాలు ఈవారంలో మార్కెట్‌ను నడిపించనున్నాయని డెల్టా గ్లోబల్‌ పాట్నర్స్‌ ప్రిన్సిపల్‌ పాట్నర్‌ దేవేంద్ర నెవ్గి అన్నారు.

మసాలా బాండ్లపై విత్‌హోల్డింగ్‌ ట్యాక్స్‌ మినహాయింపు ఇవ్వడం, అత్యవసరం కాని దిగుమతుల కట్టడి, ఎగుమతుల ప్రోత్సాహం వంటి ప్రభుత్వ ప్రకటనలు ఈవారంలో మార్కెట్‌కు సానుకూలంగా ఉండనున్నాయని భావిస్తున్నారు. సూచీలకు నూతన ఉత్తేజం ఇవ్వనుందని అంచనావేశారు. నిఫ్టీ 11,760 పాయింట్లను అధిగమించితే అప్‌ట్రెండ్‌ కొనసాగే అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపక్‌ జసని విశ్లేషించారు. దిగువస్థాయిలో 11,431–11,250 శ్రేణి మద్దతుగా వెల్లడించారు. ఇక గురువారం (సెప్టెంబరు 20న) మొహర్రం సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఈ వారంలో ట్రేడింగ్‌ 4 రోజులకే పరిమితంకానుంది.  

పెరిగిన వాణిజ్య యుద్ధ భయాలు
కొత్తగా మరో 200 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై సుంకాలను విధించాలనే నిర్ణయానికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మొగ్గు చూపుతున్న నేపథ్యంలో అమెరికా–చైనా మధ్య సయోధ్య కుదిరి వాణిజ్య యుద్ధ భయాలు తొలగిపోతాయనే అశావాహ పరిస్థితి ఇక లేనట్లే అని మార్కెట్‌ వర్గాల్లో తేటతెల్లమైపోయింది.  సోమవారం నుంచే నూతన టారిఫ్‌లు అమలయ్యే అవకాశం ఉండడంతో మార్కెట్‌ ట్రెండ్‌పై ప్రతికూల అంచనాలు వెలువడుతున్నాయి.

‘ప్రభుత్వం ప్రకటించిన రూపాయి స్థిరీకరణ చర్యలు స్వల్పకాలంలో సానుకూల ఫలితాలనే ఇస్తాయని భావిస్తున్నాం. అయితే, దేశంలోకి వచ్చే నిధుల ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోతుందని మాత్రం అనుకోవడం లేదు. ఇక ఈవారం మార్కెట్‌ ట్రెండ్‌ విషయానికి వస్తే.. మరింత ముదిరిన వాణిజ్య యుద్ధ భయాలు, పెరిగిన ముడిచమురు ధరలు, బలహీనపడిన రూపాయి విలువ వంటి ప్రతికూల అంశాలు కలవరపెడుతున్నాయి.’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధన విభాగం హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు.  

మరిన్ని చర్యలు అవసరం...
రూపాయి పతనాన్ని అడ్డుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పలు చర్యలు తాత్కాలికంగానే ఉండనున్నాయని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. ‘గతవారంలో  72.91 వద్దకు పతనమైపోయిన రూపాయి విలువను నిలబెట్టడంలో మాత్రమే ప్రభుత్వ నిర్ణయాలు సహకరిస్తాయి.

విదేశీ నిధుల ప్రవాహం కేవలం స్థిరీకరణ చేస్తుందే తప్పించి విలువను బలపరచలేదు. అమెరికా డాలరుతో అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీ విలువల కదలికలు, ముడిచమురు ధరల దిశ, ఆర్‌బీఐ జోక్యం ఇకమీదట రూపాయి విలువను నిర్ణయించనున్నాయి. రూపాయి విలువ బలపడాలి అంటే ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి. ఈవారంలో 71.50–73 శ్రేణిలో కదలికలు ఉండవచ్చని అంచనావేస్తున్నాం.’ అని కొటక్‌ సెక్యూరిటీస్‌ కరెన్సీ విభాగం డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌ అనింద్య బెనర్జీ వెల్లడించారు.   

విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు
ముడిచమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ క్షీణత కారణంగా గడిచిన తొమ్మిది ట్రేడింగ్‌ సెషన్లలో విదేశీ పెట్టుబడిదారులు క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి రూ.9,400  కోట్లను వెనక్కు తీసుకున్నారు. డిపాజిటరీ డేటా ప్రకారం సెప్టెంబరు 3–14 మధ్యకాలంలో పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.4,318 కోట్లు.. డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.5,088 కోట్లు ఎఫ్‌పీఐలు వెనక్కు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement