5జీ టెక్నాలజీతో కొత్త తరం కార్లు

Future Cars Will Have 5G Network Technology - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మోటారు వాహనాల రంగంలో ‘5 జి’ ఇంటర్నెట్‌ విప్లవాత్మక మార్పులు తీసుకరానుంది. వేగంగా దూసుకెళ్లే కార్లతోపాటు సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లకు ‘5జీ’ నెట్‌వర్క్‌ను అనుసంధానం చేస్తున్నారు. దీని వల్ల ఓ రోడ్డు మీద వెళుతున్న వాహనాలు ఒకదానికొకటి అతివేగంగా సమాచారం ఇచ్చి పుచ్చుకుంటాయి. తద్వారా ఎదురుకానున్న ప్రమాదాలను ముందే ఊహించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వాహనాలు ప్రమాదాల నుంచి తప్పించుకోగలవు. ఎదురుగా రోడ్డుపై గుంతలు వున్నా, రోడ్డుకు అడ్డుగా ప్రమాదకరమైనవి ఏవీ ఉన్నా, ముందుగా వెళ్లిన వాహనాల ద్వారా వెనకాల వచ్చే వాహనాలు తెలుసుకోగలవు. 

‘5 జీ’ సాంకేతిక పరిజ్ఞానాన్ని సెల్ఫ్‌ డ్రైవింగ్‌ వాహనాలు మరింత ఎక్కువగా, సమర్థంగా ఉపయోగించుకోగలవని గ్లాస్గో కెలెడోనియన్‌ యూనివర్శిటీ (జీసీయూ) నిపుణలు చెప్పారు. ‘టెస్లా లాంటి కార్లు భవిష్యత్తులో 5జీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకొని తమ చుట్టూ కొన్ని చదరపు మైళ్ల విస్తీర్ణంలో రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు తెలసుకుంటాయి. రోడ్డుపై ఎక్కడైన గుంతలు, రాళ్లు రప్పలు ఉన్నాయా ? వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోడ్డును మంచు కప్పేసిందా ? గాలి దుమారం ఎదురుకానుందా? అన్న విషయాలను ముందుగానే తెలుసుకొని వాటికి అనుగుణంగా స్పందిస్తాయి’ భవిష్యత్‌ కార్ల పరిశోధనా బృందం సభ్యుడు డాక్టర్‌ డిమిట్రియాస్‌ లయరోకాపిస్‌ తెలిపారు. 

ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో ఏటా 13 లక్షల మంది మరణిస్తుంటే, ఐదు కోట్ల మంది గాయపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు తెలియజేస్తున్నాయి. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వస్తోన్న కొత్త కార్ల వల్ల ఈ ప్రమాదాలు గణనీయంగా పడిపోతాయని డాక్టర్‌ డిమిట్రియా చెప్పారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘ఫోర్డ్‌’ కంపెనీ ఇప్పటికే ఈ దిశగా పనులను చేపట్టిందని, ఈ ఏడాది చివరి నాటికి తన కార్లలో 80 శాతం కార్లకు కొత్త 5జీ నెట్‌వర్క్‌ను అనుసంధించాలని లక్షంగా పెట్టుకుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top