రేట్లు తగ్గిస్తున్న ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు | FMCG companies lowering rates | Sakshi
Sakshi News home page

రేట్లు తగ్గిస్తున్న ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు

Nov 22 2017 12:00 AM | Updated on Oct 2 2018 8:16 PM

FMCG companies lowering rates - Sakshi

న్యూఢిల్లీ: పలు ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను తగ్గిన నేపథ్యంలో ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించే దిశగా ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు కూడా రేట్లు తగ్గిస్తున్నాయి. జీఎస్‌టీ భారం తగ్గిన ఉత్పత్తుల ధరలను తగ్గించినట్లు ఐటీసీ, డాబర్, హెచ్‌యూఎల్, మారికో తదితర సంస్థలు తెలిపాయి. తగ్గించిన కొత్త పన్ను రేట్లకు అనుగుణంగా పలు ఉత్పత్తుల ధరలను తగ్గించినట్లు ఐటీసీ ప్రతినిధి తెలిపారు.

‘బ్రూ గోల్డ్‌ కాఫీ 50 గ్రాముల ప్యాక్‌ ధరను రూ. 145 నుంచి రూ.111కి తగ్గించాం. మరిన్ని మార్పులేమైనా ఉంటే తెలియజేస్తాం‘ అని హెచ్‌యూఎల్‌ వర్గాలు వివరించాయి. డియోడరెంట్స్, హెయిర్‌ జెల్స్, హెయిర్‌ క్రీమ్స్, బాడీ కేర్‌ తదితర ఉత్పత్తులపై రేట్లు తగ్గించినట్లు మారికో సీఎఫ్‌వో వివేక్‌ కర్వే తెలిపారు. ‘కొత్తగా తయారయ్యే ఉత్పత్తులపై తగ్గింపు ధరలే ముద్రించి ఉంటాయి.

ఇప్పటికే ఉన్న స్టాక్స్‌పై తగ్గించిన ఎంఆర్‌పీ స్టిక్కర్స్‌ అంటించి విక్రయించడం లేదా విక్రేతల ద్వారా అదనంగా డిస్కౌంట్లు ఇవ్వడం ద్వారా జీఎస్‌టీ రేట్ల తగ్గుదల ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయిస్తున్నాం‘ అని ఆయన వివరించారు. డాబర్‌ ఇండియా షాంపూలు, చర్మ సంరక్షణ ఉత్పత్తులు మొదలైనవాటి ధరలను 9 శాతం మేర తగ్గించినట్లు డాబర్‌ ఇండియా వెల్లడించింది. ధరల తగ్గింపు పరిమాణాన్ని పరిశీలిస్తున్నట్లు పతంజలి తెలిపింది. డిటర్జెంట్లు, షాంపూలు, సౌందర్య సాధనాలు సహా 178 ఉత్పత్తులపై ఈ నెల 15 నుంచి జీఎస్‌టీ 28% నుంచి 18%కి తగ్గిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement