ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌, అసలేమిటిది? ఆఫర్లేమిటి?

Flipkart Plus To Launch On August 15 - Sakshi

ఆఫర్ల మీద ఆఫర్ల వర్షం కురిపించే దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌.. మరో సరికొత్త ప్రొగ్రామ్‌కు రేపటి నుంచి శ్రీకారం చుట్టబోతుంది. ‘ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌’పేరుతో కస్టమర్‌ లోయల్టి ప్రొగ్రామ్‌ను లాంచ్‌ చేస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దీన్ని కస్టమర్ల ముందుకు తీసుకొస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ ప్రొగ్రామ్‌కు ఈ ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ గట్టి పోటీ ఇవ్వబోతుంది. ఈ లోయల్టీ ప్రొగ్రామ్‌ను ప్రారంభించడం ఇది రెండో సారి. తొలిసారి 2014లో ‘ఫ్లిప్‌కార్ట్‌ ఫస్ట్‌’ పేరుతో ఈ లోయల్టీ ప్రొగ్రామ్‌ను ఆఫర్‌ చేసింది. 

అమెజాన్‌ ప్రైమ్‌ మాదిరిగానే..
ఫ్లిప్‌కార్ట్‌ కొత్త లోయల్టి ప్రొగ్రామ్‌, అచ్చం దాని ప్రత్యర్థి అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ సర్వీసు మాదిరిగానే ఉండబోతుంది. అమెజాన్‌ ప్రైమ్‌ లాంచ్‌ చేసిన రెండేళ్ల తర్వాత ఫ్లిప్‌కార్ట్‌ ఈ లోయల్టి ప్రొగ్రామ్‌ను తీసుకొస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ ఉచితం...
మీరు విన్నది నిజమే. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ పూర్తిగా ఉచితం. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్‌షిప్‌ ప్రొగ్రామ్‌కు ఎలాంటి వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు లేదు. అమెజాన్‌ మాత్రం తన ప్రైమ్‌ మెంబర్‌షిప్‌కు ప్రవేశ ఆఫర్‌ కింద 499 రూపాయలను సేకరించింది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు 999 రూపాయలుగా ఉంది. నెలవారీ ఫీజు 129 రూపాయలు.

ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ ప్రయోజనాలు..
ఈ ప్రొగ్రామ్‌ కింద కస్టమర్‌ లోయల్టీ పాయింట్లను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేయనుంది. ఈ పాయింట్లను ఫ్లిప్‌కార్ట్‌ తన ప్లాట్‌ఫామ్‌పై సేల్‌ ఆఫర్లు నిర్వహించే సమయంలో ఉచిత డెలివరీకి, ముందస్తు షాపింగ్‌కు, ముందస్తుగా ప్రొడక్ట్‌లు పొందేందుకు ఉపయోగించుకోవచ్చు. అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యులు మాదిరి, ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ సభ్యులు కూడా సేల్స్‌ నిర్వహించే సమయంలో ముందస్తు యాక్సస్‌ను పొందవచ్చు.

ఇది ఎలా పనిచేస్తుంది...
ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌లో జరిపే ప్రతి కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ కింద ప్లాస్‌ కాయిన్లను యూజర్లకు ఆఫర్‌ చేస్తుంది. ఈ ప్లస్‌ కాయిన్లను తర్వాత కంపెనీ వెబ్‌సైట్‌లో జరిపే షాపింగ్‌కు వాడుకోవచ్చు. ఈ ప్లస్‌ కాయిన్లను జోమాటో, బుక్‌మైషో, మేక్‌మైట్రిప్‌ వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లపై కూడా వాడుకోవచ్చు.

తమ 100 మిలియన్‌ కస్టమర్లలో ఎవరైనా ఈ కాయిన్లను పొందవచ్చని, ప్రయోజనాలను, రివార్డులను అన్‌బ్లాక్‌ చేసుకోవడం ప్రారంభించుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. గత నెలలోనే ఫ్లిప్‌కార్ట్‌ ఈ లోయల్టీ ప్రొగ్రామ్‌ను లాంచ్‌ చేయాలని ప్లాన్‌ చేసింది. కానీ కుదరలేదు. దీనికోసం వచ్చే మూడేళ్లలో 173 మిలియన్‌ డాలర్లను కూడా వెచ్చించబోతుంది. కాగ, రిటైల్‌ స్పేస్‌లో లోయల్టీ ప్రొగ్రామ్‌లు మంచి పేరును సంపాదించుకుంటున్నాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి పలు కంపెనీలు వీటిని ఆఫర్‌ చేస్తున్నాయి. అయితే ఈ ప్రొగ్రామ్‌ను కస్టమర్లకు ఆఫర్‌ చేయడంలో ఫ్లిప్‌కార్ట్‌ కాస్త ఆలస్యం చేసిందని ఈ-రిటైల్‌ మార్కెట్‌ విశ్లేషకులు చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top