ప్రభుత్వ రుణ భారం 94.62 లక్షల కోట్లు

Financial Ministry Increase Of 96 Crore Amount - Sakshi

న్యూఢిల్లీ : ప్రభుత్వంపై మొత్తం చెల్లింపుల (పబ్లిక్‌ అకౌంట్‌సహా) భారం గడచిన ఆర్థిక సంవత్సరం (2019–2020)  జనవరి– మార్చి మధ్య అంతక్రితం త్రైమాసికంతో (అక్టోబర్‌–డిసెంబర్‌) పోల్చిచూస్తే, 0.8 శాతం పెరిగి రూ.94.62 లక్షల కోట్లకు పెరిగింది. మంగళవారం ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. డిసెంబర్‌ త్రైమాసికంతో పోల్చితే మార్చి త్రైమాసికానికి చెల్లింపుల భారం రూ.93,89,267 కోట్ల నుంచి రూ.94,62,265 కోట్లకు పెరిగినట్లు ప్రకటన తెలిపింది. మొత్తం చెల్లింపుల విషయంలో ఒక్క పబ్లిక్‌ డెట్‌ పరిమాణం 90.9%గా ఉంది. డేటెడ్‌ గవర్నమెంట్‌ సెక్యూరిటీస్‌ (ప్రభుత్వ బాండ్లు), ట్రెజరీ బిల్స్, అంతర్జాతీయ ఆర్థిక రుణాలు, స్వల్పకాలిక రుణాల వంటివి పబ్లిక్‌ డెట్‌ పరిధిలోకి వస్తాయి.  

విదేశీ రుణ భారం 558.5 బిలియన్‌ డాలర్లు 
కాగా, భారత విదేశీ రుణ భారం 2020 మార్చి నాటికి 558.5 బిలియన్‌ డాలర్లుగా (డాలర్‌ రూ. 75 చొప్పున దాదాపు రూ.41.9 లక్షల కోట్లు) నమోదయ్యింది. 2019 మార్చితో పోల్చితే ఈ పరిమాణం 15.4 బిలియన్‌ డాలర్లు పెరిగినట్లు ఆర్‌బీఐ ప్రకటన పేర్కొంది. కాగా మొత్తం రుణంలో వాణిజ్య రుణాల వాటా 39.4 శాతం. ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు 23.4 శాతం. స్వల్పకాలిక వాణిజ్య రుణాల వాటా 18.2 శాతం.  

0.6 బిలియన్‌ డాలర్ల కరెంట్‌ అకౌంట్‌ మిగులు 
మరోవైపు 2020 జనవరి–మార్చి మధ్య భారత్‌ 0.6 బిలియన్‌ డాలర్ల (ఈ కాలవ్యవధి జీడీపీ విలువలో 0.1 శాతం) కరెంట్‌ అకౌంట్‌ మిగులును నమోదుచేసుకుంది. 2019 ఇదే సమయంలో భారత్‌ 4.6 బిలియన్‌ డాలర్ల కరెంట్‌ అకౌంట్‌ లోటు (జీడీపీలో 0.7 శాతం) నమోదయ్యింది. వాణిజ్యంసహా పలు అంశాలకు సంబంధించి ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో  దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసాలను ‘కరెంట్‌ అకౌంట్‌’లో చూపుతారు. గడచిన ఆర్థిక సంవత్సరం దేశ కరెంట్‌ అకౌంట్‌ లోటు (సీఏడీ) జీడీపీ విలువలో 0.9 శాతంగా ఉంది. 2018–19లో ఇది 2.1 శాతం.  

58.6 శాతానికి పెరిగిన ద్రవ్యలోటు 
ఇదిలావుండగా, ప్రభుత్వ–ఆదాయాలు వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మే ముగిసే నాటికి బడ్జెట్‌ అంచనాల్లో ఏకంగా 58.6 శాతానికి చేరింది. విలువలో ఇది 4.66 లక్షల కోట్లు. 2020–21 ఆర్థిక సంవత్సరం మొత్తంలో ద్రవ్యలోటు రూ.7.96 లక్షల కోట్లు (జీడీపీలో 3.5 శాతం) ఉండాలన్నది కేంద్రం లక్ష్యం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top