భారత్‌కు రావడానికి సరైన సమయం కాదు | Finally, Vijay Mallya bares it all to The Sunday Guardian | Sakshi
Sakshi News home page

భారత్‌కు రావడానికి సరైన సమయం కాదు

Mar 14 2016 2:19 AM | Updated on Sep 3 2017 7:40 PM

భారత్‌కు రావడానికి సరైన సమయం కాదు

భారత్‌కు రావడానికి సరైన సమయం కాదు

భారత్‌కు రావడానికి ఇది సరైన సమయం కాదని కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యా పేర్కొన్నారు...

నేరస్తుడిగా చూస్తున్నారు
* నేను పారిపోలేదు
* మీడియాతో మాట్లాడను
* సండే గార్డియన్‌తో మాల్యా ఈ మెయిల్ ఇంటర్వ్యూ

న్యూఢిల్లీ/హైదరాబాద్: భారత్‌కు రావడానికి ఇది సరైన సమయం కాదని కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యా పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే భారత్‌కు వచ్చే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేశారు.  మరోవైపు విజయ్ మాల్యాపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. కింగ్ ఫిషర్ కంపెనీ  ప్రావిడెండ్ ఫండ్ చెల్లింపుల్లో ఏమైనా అవకతవకలు జరిగాయా లేదా అన్న విషయమై దర్యాప్తు జరుపుతామని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. మరోవైపు తమకు రావలసిన వేతన బకాయిల కోసం కింగ్ షిఫర్ మాజీ ఉద్యోగులు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు.  
 
నేరస్తుడిగా ముద్ర: రూ.9,000 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత విషయమై విజయ్ మాల్యాపై వివిధ విచారణలు జరుగుతున్నాయి. ఈ విచారణలు జరుగుతుండగానే మాల్యా ఈ నెల 2న భారత్ నుంచి వెళ్లిపోవడం వల్ల రాజకీయంగా కూడా దుమారం రేగుతోంది. ఐడీబీఐ బ్యాంక్‌కు రూ.900 కోట్ల రుణ చెల్లింపుల్లో విఫలమైన కేసుకు సంబంధించి మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఈ నెల 18న ముంబైలో హాజరు కావలసిందిగా మాల్యాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ గత శుక్రవారం సమన్లు జారీచేసింది.

అయితే తాను భారతీయుడినేనని, భారత్‌కు వెళ్లాలనుకుంటున్నానని, అయితే తననొక నేరస్తుడిగా ముద్రవేశారని సండే గార్డియన్‌కు ఇచ్చిన ఈ మెయిల్ ఇంటర్వ్యూలో మాల్యా పేర్కొన్నారు. తన తరపు వాదన వినిపించడానికి తగిన అవకాశం వస్తుందని ప్రస్తుతం అనుకోవడం లేదని పేర్కొన్నారు. భారత్‌కు వెళ్లడానికి ఇది సరైన సమయం కాదని పేర్కొన్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఒక మిత్రుడితో కలసి భారత్ నుంచి వచ్చానని, అంతేకానీ పారిపోలేదని వివరించారు.
 
నేరం చేయలేదు, బలిపశువునయ్యా: రుణాలు చెల్లించకపోవడం వ్యాపారానికి సంబంధించిన విషయ మని మాల్యా తెలిపారు. రుణాలిచ్చేటప్పుడే బ్యాంకులకు రిస్క్ ఉంటుందని తెలుసునని, అన్నీ అలోచించుకునే బ్యాంకులు రుణాలిస్తాయని వివరించారు. తాను ఎలాంటి నేరం చేయలేదని, తనను బలిపశువును చేశారని, తనను నేరస్తుడిగా చూడవద్దని పేర్కొన్నారు.  తాను ఏమైనా మాట్లాడితే, ఆ మాటలను వక్రీకరిస్తారేమోనన్న భయంతో తాను మౌనంగా ఉంటున్నానని వివరించారు. ఎవరికీ తెలియకుండా దాక్కునే పరిస్థితులు సృష్టించారని, ఇది తనను బాధిస్తోందని మాల్యా పేర్కొన్నారు. అయితే  పీటీఐ పంపిన ఈ మెయిల్స్‌కు మాల్యా స్పందించలేదు.
 
మీడియా వేటాడుతోంది: మీడియా తనను వేటాడుతోందని  మాల్యా ట్వీట్ చేశారు. అయితే తాను ఎక్కడున్నదీ కనిపెట్టలేకపోయిందని ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. తాను మీడియాతో మాట్లాడదలచుకోలేదని, అందుకని మీడియా అలాంటి ప్రయత్నాలు చేయవద్దని ఆయన సూచించారు. బ్రిటన్‌లోనే ఉన్నాడని ప్రచారం అవుతున్న విజయ్ మాల్యా కొన్ని రోజులుగా తన అభిప్రాయాలను ట్వీటర్ ద్వారానే వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ మాల్యా వ్యక్తిగత విషయాలపైనే కాకుండా విమానయాన రంగంలోని సమస్యలు, తన స్పోర్ట్, పానీయాల వెంచర్‌లకు సంబంధించిన విషయాలపై కూడా ట్వీటర్‌లో ట్వీట్‌లు పెడుతున్నారు.  
 
ఎయిర్ ఇండియా నష్టాలకు బాధ్యులెవరు?
ప్రశ్నించిన  ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ మోహన్ పాయ్
విజయ్ మాల్యా బ్యాంక్ రుణాలు ఎగవేసి భారత్ నుంచి పారిపోయాడని విమర్శలు వస్తున్నాయని,  ఎయిర్ ఇండియా నష్టాల విషయంలో ఎవరూ ఎందుకు నోరు మెదపడం లేదంటూ ఇన్ఫోసిస్‌కు గతంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేసిన టి. వి. మోహన్‌దాస్ పాయ్ ప్రశ్నించారు. ఎయిర్ ఇండియా రూ.30,000 కోట్లు నష్టపోయిందని, కింగ్ ఫిషర్ నష్టాలకు విజయ్ మాల్యాను బాధ్యుడిని చేసినట్లే, రూ. 30వేల కోట్ల ఎయిర్ ఇండియా నష్టాలకు ఎవరు బాధ్యులని ఆయన అడిగారు.

కింగ్ ఫిషర్ విషయంలో బ్యాంక్ సొమ్ములు, ఎయిర్ ఇండియా విషయంలో పన్నులు చెల్లించిన ప్రజల సొమ్ములు పోయాయని పేర్కొన్నారు. పార్లమెంట్, మీడియా.. ఈ విషయంలో అందరూ మౌనంగానే ఉన్నారని విమర్శించారు. ఇది హిపోక్రసీ తప్ప, మరేమీ కాదని చెప్పారు. ఉద్యోగులకు వేతనాలు చెల్లించకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నందుకు విజయ్ మాల్యాను ఆయన తప్పుపట్టారు. విజయ్ మాల్యాను ప్రభుత్వం అరెస్ట్ చేయకూడదని, మాల్యా భారత్‌కు తిరిగి వచ్చి బ్యాంక్ బకాయిల్ని తీర్చాలంటూ ఆదేశించాలని మోహన్ పాయ్ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement