వృద్ధి స్పీడ్‌కు ఫిచ్‌ రెండోసారి బ్రేక్‌లు! | Fich Break Again to GDP | Sakshi
Sakshi News home page

వృద్ధి స్పీడ్‌కు ఫిచ్‌ రెండోసారి బ్రేక్‌లు!

Jun 18 2019 8:56 AM | Updated on Jun 18 2019 8:56 AM

Fich Break Again to GDP - Sakshi

భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం– ఫిచ్‌ వరుసగా రెండవసారి కుదించింది. 2019– 2020లో కేవలం 6.6 శాతమే నమోదవుతుందని ఫిచ్‌ అంచనా వేసింది. తొలుత 7 శాతంగా ఉన్న ఈ అంచనాలను మార్చిలో 6.8 శాతానికి తగ్గించింది. ఆర్థిక మందగమనం దీనికి కారణంగా పేర్కొంది.  తాజాగా మరో 20 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) కుదించింది.  గత ఏడాది కాలంగా తయారీ, వ్యవసాయ రంగాల పేలవ పనితీరు తమ తాజా అంచనాలకు కారణమని సోమవారం విడుదల చేసిన తన తాజా నివేదికలో ఫిచ్‌  పేర్కొంది. జీడీపీలో ఈ రెండు రంగాల వెయిటేజ్‌ కొంచెం అటు ఇటుగా 15 చొప్పున ఉంది.  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జూలై 5వ తేదీన 2019–20 పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఫిచ్‌ ‘గ్లోబల్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ పేరుతో’ తాజాగా విడుదల చేసిన నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

2020–2021లో భారత్‌ వృద్ధి 7.1 శాతానికి చేరుతుంది. అయితే 2021–2022లో ఈ రేటు 7 శాతానికి దిగివస్తుంది.  
అయితే 2019–2020కి సంబంధించి తాజా ఫిచ్‌ అంచనా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అంచనా (7 శాతం) కన్నా తక్కువగా ఉండడం గమనార్హం.  
అంతర్జాతీయ అంశాలతో పాటు దేశీయ పరిస్థితులూ భారత్‌ వృద్ధి మందగమనానికి  కారణమవుతున్నాయి. ఎగుమతుల పెరుగుదలా ఇటీవలి కాలంలో పేలవంగా ఉంది.  
బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 5.75 శాతం) రేటును 2019లో మరో 25 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గించే అవకాశాలు ఉన్నాయి. రేటు తగ్గింపు వల్ల ప్రైవేటు రంగంలో రుణ సౌలభ్యత పెరుగుతుంది. ఇది వృద్ధికి దారితీసే అంశం. ఇలాంటి పరిస్థితి దేశంలోకి పెట్టుబడులనూ ఆకర్షిస్తుంది.  
2019 చివరి నాటికి డాలర్‌ మారకంలో రూపాయి  విలువ కొంచెం అటుఇటుగా 70 వద్దే స్థిరపడుతుంది. 2020 నాటకి ఈ విలువ 71కి బలహీనపడుతుంది.  
అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం అంతర్జాతీయ పెట్టుబడులపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఇది ప్రతికూలాంశం.  
చైనాపై అమెరికా టారిఫ్‌లు తగ్గినా... 2020లో ప్రపంచ ఆర్థిక రంగం ఊపందుకునే అవకాశం లేదు. వాణిజ్యంలో అనిశ్చితి వాతావరణం ఇప్పటికే పెట్టుబడులకు సంబంధించి తీవ్ర ఆందోళనకరమైన పరిస్థితిని సృష్టించింది.  
2020 వృద్ధి రేటును ఇంతక్రితం 2.8 శాతంగా అంచనావేసినా తాజాగా 2.7 శాతానికి కుదిస్తున్నాం. చైనా వృద్ధి రేటు అంచనా కూడా 6.1 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నాం. అమెరికా వృద్ధి రేటు అంచనా కూడా 1.9 శాతం నుంచి 1.8 శాతానికి తగ్గిస్తున్నాం. 2018లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2 శాతం వృద్ధి సాధించింది. ఇది 2019లో 2.8 శాతానికి తగ్గే అకాశాలు ఉన్నాయి.   

మందగమనం సుస్పష్టం
భారత్‌ ఆర్థిక రంగం మందగమనంలో ఉన్నట్లు ఇప్పటికే స్పష్టమైంది. 2018–19లో కేవలం 6.8 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకుంది. గడచిన ఐదేళ్లలో ఇంత తక్కువ స్థాయి వృద్ధి స్పీడ్‌ ఇదే తొలసారి. ఇక జనవరి–మార్చి త్రైమాసికంలో వృద్ధి రేటు ఐదేళ్ల కనిష్టం 5.8 శాతానికి దిగింది. దీనితో ఈ త్రైమాసికంలో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న హోదాను చైనాకు భారత్‌ కోల్పోయింది. సంబంధిత త్రైమాసిక కాలంలో చైనా వృద్ధి రేటు 6.4 శాతం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement