ఎఫ్‌ఐఐల పెట్టుబడులే కీలకం..

Fed looks to avoid crossed signals at policy meeting - Sakshi

మంగళ, బుధవారాల్లో ఫెడ్‌ సమావేశం

వడ్డీ రేట్లు, ఆర్థిక అంశాలపై ప్రకటన

బీఓఈ రేట్ల నిర్ణయమూ ఈవారంలోనే..దేశీ క్యూ3 ‘క్యాడ్‌’ గణాంకాలు వెల్లడి

ఈ అంశాల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్న ఎఫ్‌ఐఐలు

21న మార్కెట్లకు ‘హోలీ’ సెలవు

ముంబై: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) భారత స్టాక్‌ మార్కెట్లలో తమ పెట్టుబడులను జోరుగా కొనసాగించిన నేపథ్యంలో గతవారం ప్రధాన సూచీలు మూడున్నర శాతం మేర లాభాలను నమోదుచేశాయి. రెట్టించిన ఉత్సాహంతో వీరు పెట్టుబడులను కొనసాగించడంతో నిఫ్టీ వారాంత ట్రేడింగ్‌ రోజున 11,427 వద్దకు చేరుకుంది. అయితే, ఇక్కడ నుంచి జీవితకాల గరిష్టస్థాయిలకు చేరుకుంటుందా..? లేదంటే, స్వల్పకాలిక దిద్దుబాటుకు లోనవుతుందా? అనే ప్రధాన అంశానికి ఎఫ్‌ఐఐల నిర్ణయమే అత్యంత కీలకం కానుందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈనెల్లో ఇప్పటివరకు దేశీ స్టాక్‌ మార్కెట్లో రూ.17,055 కోట్లను పెట్టుబడి పెట్టిన వీరు ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తే సూచీలు ఊర్థ్వముఖంగా ప్రయాణం కొనసాగిస్తాయని భావిస్తున్నారు.

‘ఎమర్జింగ్‌ మార్కెట్లతో పోల్చితే ఫిబ్రవరి మధ్యవరకు దేశీ ప్రధాన సూచీలు అండర్‌పెర్ఫార్మ్‌ చేశాయి. ఇప్పుడైతే ఈ ట్రెండ్‌లో మార్పు కనిపిస్తోంది. సాధారణ ఎన్నికలపై అంచనాలు, ఇక్కడి మార్కెట్లో స్వల్పకాలిక రాబడికి ఉన్న అవకాశాల ఆధారంగా ఎఫ్‌ఐఐల పెట్టుబడుల కొనసాగింపు ఉండనుంది. ఒకవేళ వీరి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే మాత్రం షార్ప్‌ కరెక్షన్‌ ఉంటుంది’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపక్‌ జసని విశ్లేషించారు. నిఫ్టీలో 38 శాతం వాటా కలిగిన ఫైనాన్షియల్‌ రంగంలో ప్రస్తుతం పెట్టుబడులు జోరుగా కొనసాగుతున్నాయి. వీటిలో ప్రైవేటు బ్యాంకులు బలమైన రిటైల్‌ వృద్ధిని నమోదుచేస్తుండగా.. పీఎస్‌యూ బ్యాంకులు మొండిబకాయిల భారం నుంచి బయటపడడం సానుకూలంగా ఉంది. ఇక హోలీ సందర్భంగా 21న (గురువారం) మార్కెట్లకు సెలవుకావడం గమనార్హం.      

అంతర్జాతీయ అంశాలపై దృష్టి..
అమెరికా ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ).. కీలక వడ్డీ రేట్లపై ఈవారంలో తన నిర్ణయాన్ని వెలువరించనుంది. అత్యధిక శాతం నిపుణుల అంచనాల ప్రకారం ఫెడరల్‌ ఫండ్‌ రేట్లు (2.25 శాతం నుంచి 2.5 శాతం) మార్చకపోవచ్చు. మరోవైపు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ (బీఓఈ) వడ్డీ రేట్ల నిర్ణయం గురువారం వెల్లడికానుంది. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ నిష్క్రమణ మరింత జాప్యం కానుందని తెలుస్తోంది. ఈవారంలో ఇందుకు సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. యూకే ద్రవ్యోల్బణం బుధవారం వెల్లడికానుండగా.. జపాన్‌ వాణిజ్యలోటు సోమ వారం, ద్రవ్యోల్బణం డేటా శుక్రవారం వెల్లడికానున్నాయి.  

ఎఫ్‌ఐఐల నికర కొనుగోళ్లు
మార్చి 1–15 కాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.20,400 కోట్ల పెట్టుబడులను భారత స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెట్టారు. రూ.17,919 కోట్లను ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్‌చేసిన వీరు.. రూ.2,499 కోట్లను డెట్‌ మార్కెట్లో పెట్టుబడిపెట్టారు. అటు దేశీయ, ఇటు అంతర్జాతీయ సానుకూల అంచనాలు దీనికి కారణం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top