24 గంటల్లో 1.5 మిలియన్ల వీడియోలు తొలగింపు

Facebook Removed 1.5 Million Videos of the New Zealand Mosque Attack Within 24 Hours - Sakshi

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ ఫేక్‌ న్యూస్‌,  హింసాత్మక  వీడియోల నిరోధం కోసం నిరంతరం శ్రమిస్తున్నామని వివరించింది.  న్యూజిలాండ్ ప్రధాని జసిందా అర్డర్న్ ఈ ఘటనపై ఆదివారం ఫేస్‌బుక్‌ను ప్రశ్నించిన నేపథ్యంలో సంస్థ స్పందించింది. న్యూజిలాండ్‌ నరమేధానికి సంబంధించి నిబంధనలు ఉల్లంఘించే కంటెంట్‌ను తీసివేయడానికి తీవ్రంగా శ్రమించామని ఫేస్‌బుక్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఘటన జరిగిన 24 గంటల్లోనే 1.5 మిలియన్ల వీడియోల ఫుటేజ్‌ని తొలగించినట్టు వెల్లడించింది.  వీడియోగేమ్‌ తరహాలో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసిన వీడియోలను తొలగించామని న్యూజిలాండ్‌ ఫేస్‌బుక్‌ ప్రతినిధి  మియా గార్లిక్‌ తెలిపారు. అలాగే 1.2 మిలియన్ల వీడియోల అప్‌లోడ్‌ను బ్లాక్‌ చేశామన్నారు.  

క్రైస్ట్‌చర్చ్ కాల్పుల ఉదంతంలో నిందితుడు బ్రెట్టాన్ టారాంట్ తన దాడిని ఫేస్‌బుక్‌లో దాదాపు 17 నిమిషాల పాటు ప్రత్యక్ష ప్రసారం చేశాడు. దీంతో  ఫేస్‌బుక్‌లో అతని అనుచరులు మొదట ఈ విషయం గురించి ముందుగా తెలుసుకున్నారు. దీనిపై న్యూజిలాండ్‌ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇలాంటి హింసాత్మక వీడియోలు సోషల్‌  మీడియాలో విరివిగా షేర్‌ అవుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  చట్ట ప్రకారం చెల్లదని.. ఎడిట్‌ చేసిన వీడియోలయినా సరే, సోషల్‌ మీడియా వేదికల్లో పోస్ట​ కావడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు న్యూస్‌ మీడియాకు కూడా వర్తిస్తుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే లైవ్‌ వీడియో ఫుటేజ్‌ను ప్రసారం చేసిన స్కై న్యూస్‌ ఏజెన్సీని న్యూజిలాండ్‌ బ్రాడ్‌కాస్టర్‌ జాబితా నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. 

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ ప్రాంతంలో మసీదుల్లో శుక్రవారం ఉదయం జాత్యంహకారి జరిపిన కాల్పుల్లో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు తెలుగువారు సహా ఏడుగురు భారతీయులు కూడా  ఉన్న సంగతి తెలిసిందే.  

మరోవైపు గన్‌ కల్చర్‌కి వ్యతిరేకంగా దేశంలో ఒక చట్టాన్ని తెచ్చేందుకు తమ క్యాబినెట్ సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని న్యూజిలాండ్‌ ప్రధాని జసిందా సోమవారం వెల్లడించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top