ఎలక్ట్రిక్‌ వాహనాలు... మేడిన్‌ తెలంగాణ | Electric vehicles in Madein Telangana | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ వాహనాలు... మేడిన్‌ తెలంగాణ

Jul 27 2017 12:44 AM | Updated on Sep 5 2018 3:47 PM

ఎలక్ట్రిక్‌ వాహనాలు...  మేడిన్‌ తెలంగాణ - Sakshi

ఎలక్ట్రిక్‌ వాహనాలు... మేడిన్‌ తెలంగాణ

సౌర విద్యుత్‌ రంగంలో ఉన్న ప్రీమియర్‌ సోలార్‌ హైదరాబాద్‌ సమీపంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ ప్లాంటు ఏర్పాటు చేసింది.

ప్లాంటు ఏర్పాటు చేసిన ప్రీమియర్‌ సోలార్‌
సోలార్‌ మాడ్యూల్స్‌ తయారీ కేంద్రం కూడా; ఎల్లుండి ప్రారంభం


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సౌర విద్యుత్‌ రంగంలో ఉన్న ప్రీమియర్‌ సోలార్‌ హైదరాబాద్‌ సమీపంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ ప్లాంటు ఏర్పాటు చేసింది. తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఈ నెల 29న దీన్ని ప్రారంభిస్తారు. సంగారెడ్డి జిల్లా అన్నారంలోని ఈ ప్లాంటులో సోలార్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ రిక్షాలు, సోలార్‌ ఈ–బైక్స్, సోలార్‌ సైకిల్‌ రిక్షాలు, సోలార్‌ బైసికిల్స్‌ రూపొందిస్తారు. నెలకు 200 యూనిట్ల సామర్థ్యం దీని సొంతం. హైబ్రిడ్‌ ఈ–రిక్షా ఒకసారి చార్జ్‌ చేస్తే 125–130 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని ప్రీమియర్‌ సొలార్‌ చైర్మన్‌ సురేందర్‌ పాల్‌ సింగ్‌ బుధవారమిక్కడ మీడియాకు చెప్పారు. దేశంలో తొలిసారిగా ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీ ధ్రువీకరణ పొందిన ఉత్పాదన ఇదేనన్నారు. సోలార్‌ సైకిల్‌ రిక్షా 30 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందన్నారు.

మాడ్యూల్స్‌ తయారీకి రూ.400 కోట్లు..
ఇదే ఫెసిలిటీలో 200 మెగావాట్ల సామర్థ్యంతో అత్యాధునిక మాడ్యూల్‌ తయారీ ప్లాంటును సైతం నెలకొల్పారు. దీన్ని నాలుగేళ్లలో 1,000 మెగా వాట్ల స్థాయికి తీసుకెళతామని కంపెనీ ఎండీ చిరంజీవ్‌ సింగ్‌ సలూజా తెలిపారు. మొత్తంగా రూ.400 కోట్ల పెట్టుబడి పెడతామన్నారు. ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మందికి ఉపాధి లభిస్తుంది. కొత్త ప్లాంటుతో కంపెనీ దేశీ టాప్‌–5 జాబితాలో చేరింది. పవర్‌ ప్లాంట్లు, రూఫ్‌ టాప్‌ విభాగంలో 100 మెగావాట్ల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.

భవిష్యత్‌లో వేఫర్స్‌ తయారీ..
సోలార్‌ సెల్‌ తయారీకి కొత్త యూనిట్‌ను కూడా నెలకొల్పాలని కంపెనీ నిర్ణయించింది. 2018 సెప్టెంబర్‌కల్లా 250 మెగావాట్ల సామర్థ్యంతో తొలి దశ పూర్తి చేస్తామని పేర్కొంది. 1,000 మెగావాట్ల సామర్థ్యంతో నాలుగేళ్లలో ఈ విభాగంపై రూ.1,200 కోట్లు వెచ్చించనున్నారు. తెలంగాణ లేదా ఒడిశాలో ఈ ప్లాంటు వస్తుంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలనుబట్టి ప్లాంటు స్థలాన్ని నిర్ణయిస్తామని కంపెనీ ఈడీ కార్తీక్‌ పొల్సానీ వెల్లడించారు. జపాన్, చైనా కంపెనీల భాగస్వామ్యంతో దీనిని స్థాపిస్తున్నట్టు చెప్పారు. ఇదే భాగస్వామ్యంలో భవిష్యత్తులో వేఫర్స్‌ తయారీలోకి అడుగుపెడతామని వెల్లడించారు. అన్నారం ప్లాంటులో ఇప్పటికే 50 మెగావాట్ల సోలార్‌ సెల్‌ తయారీ ప్లాంటు ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement