ఇంటి నిర్వహణ ఇక తేలికే.. | Sakshi
Sakshi News home page

ఇంటి నిర్వహణ ఇక తేలికే..

Published Mon, Jun 6 2016 12:42 AM

ఇంటి నిర్వహణ ఇక తేలికే..

 కామన్‌ఫ్లోర్.కామ్, అప్నా కాంప్లెక్స్.కామ్, సొసైటీ123.కామ్, సొసైటీ రన్.కామ్, ఇట్స్ మైహోమ్.కో.ఇన్...

 ఇల్లు పూర్తిగా తయారయ్యాక గృహప్రవేశం చేస్తాం. తరవాత నిర్వహణ ఉంటుంది కదా!! చిన్న ఇంట్లోనే డ్రైనేజీ, విద్యుత్, నీటి వంటి నెలవారీ చెల్లింపులు, వాటిని సరిగా నడిచేలా చూడటం వంటివి సరిగా చెయ్యకపోతే సవాలక్ష సమస్యలొస్తాయి. మరి పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీల్లో అయితే మరీను. అందుకే గేటెడ్ కమ్యూనిటీల్లో నిర్వాసితుల సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అయితే దీన్నీ ఆన్‌లైన్ ద్వారా నిర్వహించే కంపెనీలున్నాయిప్పుడు. సంఘం ఏర్పాటు నుంచి రిజిస్ట్రేషన్... నెలవారీ చెల్లింపులు... ఇలా ప్రతిదీ సకాలంలో చేసిపెట్టడమే వీటి పని. ఆ సేవల్ని చూస్తే...

 అకౌంటింగ్ ఫ్లాట్‌ఫాం: నివాసితుల సంఘానికి ఒక ప్రత్యేకమైన వెబ్‌పోర్టల్‌నిస్తారు. దీన్లో సంఘం సభ్యుల సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు, ప్రతి ఫ్లాట్ విస్తీర్ణం, గృహ యజమానులు, వారి ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ వంటి వ్యక్తిగత వివరాలుంటాయి. నెలవారీ చెల్లింపుల గడువు రాగానే క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా ప్రతి ఫ్లాట్ వాసులకు ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్ రూపంలో సమాచారం అందిస్తుంది. వెంటనే వారు పోర్టల్‌లోకి లాగిన్ అయి సంఘం బ్యాంక్ ఖాతాలో జమ చేయవచ్చు.

 హెల్ప్ డెస్క్: గేటెడ్ కమ్యూనిటీలో విద్యుత్, మంచినీరు, డ్రైనేజీ, లిఫ్టుల నిర్వహణకు సంఘం తరపున ప్రత్యేకంగా ఉద్యోగులుంటారు. ఫ్లాట్‌వాసులకు వీటిల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా పోర్టల్ ద్వారా ఆ ఉద్యోగులకు నేరుగా సమాచారం వెళుతుంది.

 కమ్యూనికేషన్ కొలాబిరేషన్: ప్రతి సంఘం మెమొరాండం ఆఫ్ అసోసియేషన్ (సంఘం పేరు, ప్రధాన లక్ష్యాలు, ఆఫీసు చిరునామా, కార్యవర్గ సభ్యుల పూర్తి వివరాలుంటాయిందులో), సంఘం నిబంధనలు (బైలాస్), నెలవారీ సమావేశాలు, కొత్తగా తీసుకున్న నిర్ణయాలు, అపార్ట్‌మెంట్‌లోకి కొత్తగా వచ్చిన వారి వివరాలతో పాటుగా సంఘం ఖాతాలోని సొమ్మును వేటి కోసం ఖర్చు చేస్తున్నారు వంటి సమస్త సమాచారం ఎప్పటికప్పుడు సంఘం వెబ్‌సైట్‌లో అప్‌డేట్ అవుతుంది. ఫ్లాట్‌వాసులందరికీ ఎలక్ట్రానికల్‌గా తెలుసుకోవచ్చు.

 గేట్ కీపర్: అపార్ట్‌మెంట్ ప్రధాన ద్వారం వద్ద ఉండే సెక్యూరిటీగార్డ్ దగర ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. ఇందులో అపార్ట్‌మెంట్ వాసులందరి వివరాలుంటాయి. ఎవరైనా ఫ్లాట్ వాసులను కలిసేందుకు వచ్చినప్పుడు వారి వివరాలను, ఫొటోలను సంబంధిత ఫ్లాట్‌వాసులకు చేరవేరుస్తుంది. వారు సరే అంటే వచ్చినవారిని లోనికి రానిస్తారు.

 ‘‘ఒక్క ముక్కలో చెప్పాలంటే మాది టెక్నాలజీ ఆధారంగా పనిచేసే సెల్ఫ్ మెయింటెనెన్స్ సిస్టమ్. ఇంటర్నెట్‌తో పనిలేదు. ప్రతి పనీ సకాలంలో చేయటమే మా బాధ్యత’’.  - రాజశేఖర్, కో ఫౌండర్- అప్నా కాంప్లెక్స్

Advertisement
 
Advertisement
 
Advertisement