కరోనాపై కార్పొరేట్ల యుద్ధం

Donations Pour In For PM Cares Fund For Coronavirus - Sakshi

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.500 కోట్లు

ఎల్‌అండ్‌టీ రూ. 150 కోట్లు

హీరో గ్రూపు నుంచి రూ. 100 కోట్లు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను ఎదుర్కొనే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ అనే ప్రత్యేక నిధికి కార్పొరేట్లు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. దేశంలోనే సంపన్నుడైన ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.500 కోట్లను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అలాగే, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల సీఎం సహాయనిధికి చెరో రూ.5 కోట్లను కేటాయించింది. ఇంజనీరింగ్‌ దిగ్గజం ఎల్‌అండ్‌టీ కూడా పీఎం కేర్స్‌కు రూ.150 కోట్లను ప్రకటించింది. అలాగే, లౌక్‌డౌన్‌ సమయంలో ఎల్‌అండ్‌టీ తన కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు చెల్లించనుంది. ఇందు కోసం ప్రతి నెలా రూ.500 కోట్లను పక్కన పెట్టనున్నట్టు ఎల్‌అండ్‌టీ గ్రూపు చైర్మన్‌ ఏఎం నాయక్‌ తెలిపారు. ఇప్పటికే టాటాసన్స్, టాటా గ్రూపు కలసి రూ.1,500 కోట్లను పీఎంకేర్స్‌ కోసం ప్రకటించాయి. ఇక హీరో గ్రూపు సైతం కరోనా వైరస్‌ నివారణ చర్యల కోసం రూ.100 కోట్లను ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. ఇందులో రూ.50 కోట్లను పీఎం కేర్స్‌కు, మరో రూ.50 కోట్లను నివారణ చర్యలకు ఖర్చు చేయనుంది.  

పేటీఎం సైతం రూ.500 కోట్లు:  పేటీఎం సైతం పీఎం కేర్స్‌ సహాయనిధికి రూ.500 కోట్లు అందించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తోటి పౌరుల నుంచి విరాళాలు అందించాలని ఈ సంస్థ కోరింది. యూజర్లు ఇచ్చే ప్రతీ రూ.10కి అదనంగా తాను రూ.10కూడా కలిపి పీఎం కేర్స్‌కు అందించనున్నట్టు ప్రకటించింది.

ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ రూ.100 కోట్లు...
కరోనా సహాయ చర్యల్లో భాగంగా పీఎం కేర్స్‌ నిధికి రూ.50 కోట్లను విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మరో రూ.50 కోట్లను సొంతంగా ఖర్చుచేయనుంది.

ఎన్‌ఎండీసీ రూ.150 కోట్లు
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కరోనా వైరస్‌ మీద కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి మద్ధతుగా నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ) పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ.150 కోట్లు విరాళంగా అందించింది. దేశంలోని ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఇదే అతిపెద్ద సహాయమని ఈ మేరకు ఎన్‌ఎండీసీ సీఎండీ బైజేంద్ర కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

అమర్‌రాజా గ్రూప్‌ రూ.6 కోట్లు..: బ్యాటరీ తయారీ సంస్థ అమర్‌రాజా గ్రూప్‌ కరోనా  నియంత్రణకు రూ.6 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఇందులో కంపెనీ ఉద్యోగుల ఒక రోజు వేతనం కూడా కలిపి ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.5 కోట్లు, తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.కోటి అందిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

సిగ్నిటీ రూ.50 లక్షలు..: హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ సర్వీసెస్‌ కంపెనీ సిగ్నిటీ టెక్నాలజీస్‌ తెలంగాణ ప్రభుత్వ కోవిడ్‌ సహాయ నిధికి రూ.50 లక్షల విరాళంగా అందించింది. ఈ మేరకు సిగ్నిటీ సీఎండీ సీవీ సుబ్రహ్మణ్యం  మంత్రి కేటీ రామారావుకు చెక్‌ను అందజేశారు.

మ్యాన్‌కైండ్‌ రూ. 51 కోట్లు..: న్యూఢిల్లీకి చెందిన ఫార్మాసూటికల్‌ కంపెనీ మ్యాన్‌కైండ్‌ కరోనా వైరస్‌ మీద ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న యుద్దానికి మద్దతుగా రూ.51 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఇం దులో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి రూ.3 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రూ.కోటి అందిస్తున్నట్లు కంపెనీ చైర్మన్‌ ఆర్‌సీ జునెజా ఒక ప్రకటనలో తెలిపారు.

ఎన్‌సీసీ రూ.కోటి..:  కన్‌స్ట్రక్షన్స్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ ఎన్‌సీసీ లిమిటెడ్‌ కరోనా వైరస్‌ నియంత్రణ కోసం తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.కోటి నిధులను అందజేసింది. ఈ మేరకు కంపెనీ ఎండీ రంగరాజు సీఎం కే చంద్రశేఖర్‌ రావుకు చెక్‌ను అందజేశారు.

పరిష్కారాలకు రూ. 2.5 కోట్లు
పారిశ్రామిక దిగ్గజం హర్‌ష మారివాలా ఆఫర్‌
ముంబై: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వచ్చే నెల రోజుల్లో వినూత్న పరిష్కారమార్గాలు కనుగొనే వారికి రూ. 2.5 కోట్ల బహుమతి ఇవ్వనున్నట్లు  ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం మారికో అధినేత, పారిశ్రామికవేత్త హర్‌‡్ష మారివాలా ప్రకటించారు. రెండు లాభాపేక్షరహిత సంస్థలతో కలిసి వ్యక్తిగత హోదాలో తాను ఇందుకోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఇన్నోవేట్‌2బీట్‌కోవిడ్‌ పేరిట నిర్వహిస్తున్న పోటీలో మెడ్‌–టెక్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్, కార్పొరేటర్లు, నూతన ఆవిష్కర్తలు పాల్గొనాలంటూ మారికో ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ ఆహ్వానించింది. స్వల్ప సమయంలోనే భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు అనువైన సొల్యూషన్స్‌పై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు మారివాలా తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top