బిట్‌కాయిన్ల ఆచూకీ చెబితే రూ.2 కోట్లు

Coinsecure Puts Rs 2 Crore Bounty To Recover Lost Bitcoins - Sakshi

న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద బిట్‌కాయిన్‌ చోరి వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ప్రముఖ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్‌ కాయిన్‌సెక్యుర్‌ నుంచి దాదాపు రూ.20 కోట్ల విలువైన 438 బిట్‌కాయిన్లు చోరికి గురయ్యాయి. ఈ దొంగతనానికి గురైన బిట్‌కాయిన్ల ఆచూకీ కోసం ఈ ఎక్స్చేంజీ తీవ్ర ఎత్తున్న ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. దీంతో తాము కోల్పోయిన బిట్‌కాయిన్ల కనిపెట్టి, ఆచూకీ చెప్పిన వారికి రూ.2 కోట్ల రివార్డు అందిచనున్నట్టు కాయిన్‌సెక్యుర్‌ ప్రకటించింది. ‘మా నిధులను రికవరీ చేసుకునేందుకు హ్యాకర్లను గుర్తించడానికి మా యూజర్ల నుంచి, బిట్‌కాయిన్‌ కమ్యూనిటీ నుంచి సాయం కోరుతున్నాం’ అని కాయిన్‌సెక్యుర్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ వారం మొదట్లో తమ కంపెనీ వాలెట్‌ నుంచి రూ.20 కోట్ల విలువైన 438 బిట్‌కాయిన్లు చోరికి గురైనట్టు కాయిన్‌సెక్యుర్‌ ఢిల్లీ పోలీసు సైబర్‌సెల్‌ వద్ద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం ప్రకటించిన రివార్డు విలువ చోరికి గురైన మొత్తం విలువలో 10 శాతం.

అసలేం జరిగింది...?
కాయిన్‌సెక్యుర్‌ అనే ఈ క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్‌కు రెండు లక్షలకు పైగా యూజర్లున్నారు. ఆఫ్‌లైన్‌గా వారు బిట్‌కాయిన్లను కంపెనీ స్టోర్‌ చేస్తోంది. వీటిని స్టోర్‌ చేయడానికి ఉపయోగించే ప్రైవేట్‌ కీలు అంటే పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ లీకేజీ ద్వారా హ్యాకింగ్‌కు పాల్పడ్డారు. దీనికి గుర్తించిన కంపెనీ, హ్యాకర్లను గుర్తించడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ ప్రభావితానికి గురైన వాలెంట్ల డేటా అంతా అప్పటికే చోరీకి గురై, మొత్తం డేటాను హ్యాకర్లు తొలగించేశారు. బిట్‌కాయిన్లను కూడా ట్రాన్స్‌ఫర్‌ చేసేసుకున్నారు.  ఇక కంపెనీ ఏం చేయలేని పరిస్థితుల్లో గురువారం రాత్రి నుంచి ఈ విషయాన్ని తన వెబ్‌సైట్‌ ద్వారా యూజర్లకు తెలపడం ప్రారంభించింది. తమ బిట్‌కాయిన్ల నిధులు బయటికి బహిర్గతమయ్యాయి అని చెప్పడానికి చింతిస్తున్నామని కంపెనీ ప్రకటించింది. ఈ చోరీలో అంతర్గత వ్యక్తుల పాత్ర ఉందని అనుమానిస్తున్నట్టు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మోహిత్‌ కర్లా అన్నారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top