రానున్నవి 5జీ రోజులే..

Chinese Book Predicts Indian 5G Market Will Be Enormous - Sakshi

బీజింగ్‌ : దీర్ఘకాలంలో భారత్‌లో 5జీ మార్కెట్‌ భారీగా వృద్ధి చెందనుందని ప్రపంచవ్యాప్తంగా ఇంటర్‌నెట్‌ స్థితిగతులపై చైనా ప్రభుత్వం ప్రచురించిన ఓ పుస్తకం అంచనా వేసింది. భారత్‌లో ఇంటర్‌నెట్‌ వ్యాప్తి విస్తరించడం, పెద్దసంఖ్యలో యూజర్లు ఆన్‌లైన్‌కు మళ్లడంతో ఈ రంగంలో వేగవంతమైన పురోగతి చోటుచేసుకుంటోందని పేర్కొంది. 2025 నాటికి భారత్‌లో 35 శాతం మంది 5జీకి కనెక్ట్‌ అవుతారని ఈ బుక్‌ వెల్లడించింది. భారత్‌లో ఇంటర్‌నెట్‌ వేగంగా విస్తరిస్తుండటంతో చైనాకు చెందిన వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ 2018లో ఏకంగా 560 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టిందని వివరించింది. ప్రపంచ ఇంటర్‌నెట్‌ అభివృద్ధి నివేదిక పేరిట విడుదలైన ఈ పుస్తకాన్ని చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైబర్‌స్పేస్‌ స్టడీస్‌ (సీఏసీఎస్‌) ప్రచురించింది. 3జీ, 4జీ కంటే వేగవంతమైన సెల్యులార్‌ టెక్నాలజీగా 5జీ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

భారత్‌లో 5జీ మార్కెట్‌కు ఉన్న ఆదరణ దృష్ట్యా భారత్‌లో 5జీ లైసెన్స్‌ దక్కించుకునేందుకు చైనా టెలికం దిగ్గజం హువై రేసులో ఉన్నట్టు చెబుతున్నారు. ఇక ఇంటర్‌నెట్‌కు సంబంధించి వివిధ పారామీటర్‌లను పరిగణనలోకి తీసుకున్న సీఏసీఎస్‌ అంతర్జాతీయ ఇంటర్నెట్‌ అభివృద్ధి సూచీలో భారత్‌ 8వ స్ధానంలో నిలిచిందని పేర్కొంది. ఈ జాబితాలో అమెరికా, చైనాలు వరుసగా ప్రధమ, ద్వితీయ స్ధానాల్లో ఉన్నాయి. చైనా తర్వాత భారత్‌ రెండో అతిపెద్ద టెలికాం మార్కెట్‌ను కలిగిఉందని సీఏసీఎస్‌ విశ్లేషించింది. అలీబాబా,టెన్సెంట్‌, బైట్‌డ్యాన్స్‌ వంటి చైనా టెక్‌ దిగ్గజాలు ఇప్పటికే భారత్‌ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు పెట్టాయి. భారత్‌లో ఇంటర్‌నెట్‌ వృద్ధి వేగంగా పరుగులు పెడుతున్నా ఇంటర్‌నెట్‌ సంబంధిత మౌలిక సదుపాయాల విషయంలో ఇంకా వెనుకబడే ఉందని ఈ నివేదిక వెల్లడించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top