
న్యూఢిల్లీ: బడ్జెట్ పరిభాషపై సామాన్యులు, విద్యార్థులకు అవగాహన కల్పించే దిశగా కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. జనవరి 22 నుంచి సోషల్ మీడియాలో ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనుంది. ‘అర్థ్‌శాస్త్రి’ పేరిట నిర్వహించే ఈ ప్రచార కార్యక్రమంలో.. పలు సంక్లిష్టమైన ఆర్థిక అంశాలను ఆసక్తికరమైన యానిమేటెడ్ వీడియోల రూపంలో వివరించనుంది. బడ్జెట్ ప్రక్రియ గురించి సరళమైన విధానంలో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని అధికారవర్గాలు తెలిపాయి. గతేడాది కూడా కేంద్రం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఫిబ్రవరి 1న కొత్త ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మరోవైపు, బడ్జెట్ హామీల్లో నెరవేర్చిన వాటి గురించి తెలియజేసేందుకు ఆర్థిక శాఖ ‘హమారాభరోసా’ ట్యాగ్‌తో మరో ప్రచార కార్యక్రమం కూడా ప్రారంభించింది. జనవరి 29 దాకా ఈ రెండూ కొనసాగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.