
2018 కల్లా భారత్‌లో 4 లక్షల మంది మిలియనీర్లు
వచ్చే మూడేళ్లలో (2018 కల్లా) భారత్‌లో మిలియనీర్ల సంఖ్య 4.37 లక్షలకు చేరుకోనుంది. 2023 కల్లా ఇది రెట్టింపు
వెల్త్-ఎక్స్ నివేదిక
న్యూఢిల్లీ : వచ్చే మూడేళ్లలో (2018 కల్లా) భారత్‌లో మిలియనీర్ల సంఖ్య 4.37 లక్షలకు చేరుకోనుంది. 2023 కల్లా ఇది రెట్టింపు కానుంది. ‘దశాబ్దాల సంపద: రాబోయే పదేళ్లలో సంపద’ పేరిట వెల్త్-ఎక్స్ ఆవిష్కరించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. రాబోయే పదేళ్లలో అత్యంత సంపన్నుల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో ఈ దశాబ్దం భారత్‌ది కానున్నట్లు సంస్థ పేర్కొంది. ఆర్థిక పరిస్థితులపై ఆశావహ దృక్పథం, సంస్కరణలకు అనుకూల ప్రభుత్వం ఏర్పడటం తదితర అంశాలు కూడా అత్యంత సంపన్నుల సంఖ్య పెరగడానికి దోహదపడుతోందని వెల్త్-ఎక్స్ తెలిపింది. డాలర్ మారకంలో గతేడాది కాలంలో దేశీయంగా మిలియనీర్ల సంఖ్య 27 శాతం ఎగసి.. 1,96,000 నుంచి 2,50,000కి పెరిగినట్లు పేర్కొంది. నివేదిక ప్రకారం.. రాబోయే రోజుల్లో భారత్, బ్రెజిల్ వంటి వర్ధమాన దేశాల్లో కుబేరుల సంఖ్య అత్యంత వేగంగా పెరగనుంది.