
కేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు 2025ను వెనక్కి తీసుకుంది. ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961లో మార్పులు చేస్తూ ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్రం ఫిబ్రవరి 13న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ నూతన ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు 2025ను తాజాగా ఉపసంహరించుకుంది.
బైజయంత్ పాండా నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ చేసిన అనేక సిఫార్సులను చేర్చి నూతన ఆదాయపు పన్ను బిల్లు సరికొత్త వెర్షన్ ఆగస్టు 11న అంటే సోమవారం తిరిగి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. బిల్లులో కొత్త మార్పులు చేస్తన్న క్రమంలో బహుళ వెర్షన్ల గందరగోళాన్ని నివారించడానికి అన్ని మార్పులతో స్పష్టమైన, నవీకరించిన ఆదాయపు పన్ను బిల్లును ఆగస్టు 11న సభ పరిశీలన కోసం ప్రవేశపెట్టనున్నారు.
ఆదాయపు పన్ను బిల్లు 2025 మార్పులు
గత ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను బిల్లు- 2025 అరవై సంవత్సరాల నాటి భారతదేశ ప్రత్యక్ష పన్ను చట్టంలో పలు కీలక మార్పులు తీసుకొస్తోంది. 298-సెక్షన్ ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో ప్రస్తుత శాసనం కంటే 50 శాతం తక్కువ సరళమైన భాషలో రాసిన ఆధునిక, పన్ను చెల్లింపుదారులకు స్నేహపూర్వక చట్టాన్ని తీసుకురావడం ఆదాయపు పన్ను బిల్లు- 2025 ముఖ్యమైన లక్ష్యం.